Menu bar





Sunday, October 13, 2013

విదేశాలకు వెళ్ళినా సమైక్యాంధ్రే!

విదేశాలలో ప్రధానిని వెంటాడిన సమైక్య ఉద్యమం!

భారత ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వెంట మీడియా బృందంలో ఒకడిగా ఆగ్నేయాసియా దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియాలో పర్యటిస్తున్న నాకు ఇక్కడి మీడియా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల కిస్తున్న ప్రాధాన్యత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆసియాలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య, సాంకేతిక సహకార ఒప్పందాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందుకోసం మన్మోహన్‌ వెంట భారత పరిశ్రమల సమాఖ్యతో పాటు వివిధ వర్గాలకు చెందిన బృందాలు తరలొచ్చాయి. ఢిల్లినుంచి నేరుగా బ్రూనే చేరుకున్న మా బృందం రెండో రోజు జకార్తా కొచ్చింది. మీడియా బృందంలో జాతీయ, అంతర్జాతీయ సమాచార వ్యవస్థ ప్రతినిధులున్నారు. ప్రధాని ప్రయాణించిన ప్రత్యేక విమానంలో జరిగిన మీడియా సమావేశం నుంచి జకార్తాలో ప్రధాని ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూల నుంచీ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఏదొక సందర్భంలో సీమాంధ్రలో సాగుతున్న సమైక్య ఉద్యమం ప్రస్తావనకొస్తూనే ఉంది.

తొలిరోజు ప్రధాని అంతర్గత వ్యవ హారాల సలహాదారుడితో జరిగిన మీడియా సమావేశంలో కూడా ఇదే కీలకాంశమైంది. తెలంగాణా విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ఎలా సంతృప్తిపర్చగలరంటూ మీడియా ఆయన్ను ప్రశ్నించింది. సీమాంధ్రుల సందేహాల్ని నివృత్తి చేయకుండా విభజన ఎలా చేయగలరంటూ కూడా నిలదీసింది. జకార్తాలో ప్రధాని పర్యటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఇండోనేషియాలోని అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న పత్రికల నుంచి అంతర్జాతీయంగా వెలువడే ఇంగ్లీషు పత్రికల వరకు అన్నింట్లోనూ ప్రధాని పర్యటనను ప్రముఖంగా ప్రచురించారు.

వీటిలో కూడా భారత్‌లో కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన అనంతరం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని మన్మోహన్‌ ఆగ్నేయాసియా దేశాల పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందంటూ పత్రికలు వ్యాఖ్యానించాయి. సీమాంధ్ర ఉద్యమానికి జాతీయస్థాయి గుర్తింపు దక్కలేదన్న ఆవేదన అక్కడి ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్‌ ఛానల్స్‌ ఈ ఉద్యమాన్ని పెద్దగా ప్రసారం చేయడంలేదన్న భావనుంది. కానీ ఈ పర్యటనలో నాకు సీమాంధ్ర ఉద్యమ ప్రభావం స్పష్టంగా తేటతెల్లమైంది. అహింసాయుతంగా, మహాత్మాగాంధీ విధానంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోని రాజకీయవేత్తలు, పార్టీలు గుర్తించక పోవచ్చు. కానీ అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించగలిగింది.

న్యూయార్క్‌ నుంచి వెలువడే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆసియా ఎడిషన్‌లో శుక్రవారం ప్రచురించిన ప్రధాని పర్యటన వార్తల్లో సీమాంధ్ర ఉద్యమ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆగ్నేయాసియా దేశాలు చైనాతో ఎ దుర్కొంటున్న సమస్యలపై రెండ్రోజుల క్రితం లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రికలో రాసిన కథనంలో కూడా భారత్‌లో నెలకొన్న పలు సమస్యల్ని పేర్కొన్నారు. అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఒక కీలకసమస్యగానే రాశారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో మన్మోహన్‌ అంత ర్జాతీయ వేదిక ఎక్కుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఇండోనేషియా జాతీయ పత్రికలు కోంపస్‌, యనాలిసా, సౌరకార్య, రిపబ్లికన్‌లలో కూడా భారత ప్రధాని పర్యటన వార్తల్లో సమైక్యాంధ్ర ఉద్యమ అంశాన్ని పేర్కొన్నారు. ఇండోనేషియాలో జరిగిన మీడియా సమావేశంలో కూడా భారత్‌లో కొత్త రాష్ట్ర ఏర్పాటు అంశం ప్రస్తావనకొచ్చింది. కోంపస్‌ పత్రికకు ప్రధాని ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా భారత అంతర్గత సమస్యలపై ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఒక్క జాతీయ పత్రికల్లోనే కాదు.. జకార్తా నుంచి వెలువడే ప్రాంతీయపత్రికలు కోరన్‌, పోస్‌కోట్టా, పపువా ప్రాంతంలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న సెండెరవాశిక్‌ పోస్‌, తూర్పు కలిమంటన్‌ ప్రాంతం నుంచి వెలువడే గావి, మానుంటుంగ్‌లలో కూడా భారత్‌లో రాష్ట్ర విభజన ఉద్యమ వార్తల్ని ప్రచురించారు.

ఇక చైనా నుంచి వెలువడే జింహాంగ్‌ పోస్ట్‌ పత్రికలో ఓ వైపు భారత్‌ పలు అంతర్గత వివాదాలతో సతమతమౌతుంటే ఆ దేశ ప్రధాని వ్యాపార ఒప్పందాల కోసం తిరుగుతున్నారంటూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న టెర్రరిజం, నక్సలిజం, విభజనవాద ఉద్యమాల గురించి ప్రస్తావించారు. ఇండోనేషియాలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న ఇంగ్లీష్‌ పత్రిక బాలి టైమ్స్‌ ఇంటర్వ్యూలో కూడా ప్రధానిని దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక ఉద్యమాలు, కొత్త రాష్ట్ర ఏర్పాటు వివాదాల అంశంపై ప్రశ్నలు సంధించారు.

No comments:

Post a Comment