Menu bar





Monday, November 11, 2013

శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుంది?


               తెలంగాణా బిల్లును శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడితే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణా ఏర్పాటు అంశాన్ని అందరి కన్నా ముందుగా తలకెత్తుకున్న భారతీయ జనతా పార్టీ ఆ తర్వాతి కాలంలో ఉద్యమాన్ని అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. తెలంగాణా ఛాంపియన్‌గా అవతరించాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశలు తీరలేదు. ఆ స్థానం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితిని తప్పించేం దుకు బిజెపి చేసిన చాలా ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో రాజకీ య జెఏసి నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొ న్నాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ చేసిన యత్నం ఆ ఎన్ని క వరకు ఫలించినా ఆ తర్వాత టిఆర్‌ ఎస్‌దే పైచేయిగా మారింది. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌తో రాజకీయ వైరం గుంభనంగా కొనసాగుతూనే ఉంది.

                ఇరు పార్టీల మధ్య సఖ్యత కనిపించకపోగా శత్రుభావన నెలకొని ఉంది. అంతే కాకుండా తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత టిఆర్‌ఎస్‌ను ఆ పార్టీలో కలిపేసేందుకు మంతనాలు సాగుతుండటం కూడా బిజెపికి కంటగింపుగా మారింది. గత ఎన్నికలలో బిజెపి వైపు వెళ్లిన టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌తో అంటకాగుతుండటంతో భారతీయ జనతా పార్టీ తన వైరాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో ఇటు టిఆర్‌ఎస్‌, అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్‌ పార్టీకే చేరువ అవుతుండటంతో ఇటు సమైక్య ఆంధ్ర ఉద్యమం వైపుగానీ అటు తెలంగాణా వైపు గానీ మొగ్గు చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సిద్ధాంత కర్తలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందువల్లనే ఇటీవల భారతీయ జనతా పార్టీ తన రూటును మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఆంధ్ర వారికి, రాయలసీమ వారికి న్యాయం చేయకుండా తెలంగాణా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ స్థాయిలో చెబుతున్నారు.

                 కాంగ్రెస్‌ పార్టీ కేవలం తన రాజకీయ అవసరాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ విభజనను త పెట్టిందని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో విపరీతమైన ప్రచారం చేసింది. ఈ నేపధ్యంలో లోక్‌సభ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు సభ ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీ వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది. లోక్‌సభలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లు వస్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌కు సహకరించి బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకమేనని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటు అంశం తమ ఎజెండాగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ తలకెత్తుకుంటే దానికి ఎంత వరకు మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్ధకమేనని కూడా అంటున్నారు. మరి ఈ నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణా ప్రజలకు దూరం కాకుండా ఉండే విధంగానూ తెలంగాణా రాకుండా ఉండే విధంగానూ కూడా తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

                మరి ఈ రెండు అంశాలు ఏకకాలంలో ఏ విధంగా సాధ్యం అవుతాయనే విషయమే ఆసక్తికరంగా మారింది. దీనిపై భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు భారీ కసరత్తు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీ వైఖరి మారలేదని బిజెపి సీనియర్‌ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయకుడు స్పష్టంగా చెప్పినా కూడా పార్టీ అనుసరిస్తున్న విధానం మాత్రం మారినట్లుగానే కనిపిస్తున్నది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోని వారికి న్యాయం చేయకుండా తెలంగాణా ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉండదనే వాదనను భారతీయ జనతా పార్టీ గట్టిగా చెబుతున్నది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఆంధ్ర ప్రాతం నాయకులు ఢిల్లీ స్థాయిలో తమ వాణిని వినిపించగా దానిపై బిజెపి అగ్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే అదే సమయంలో తెలంగాణా అంశం నుంచి కూడా దూరంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

               తెలంగాణా బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన తర్వాత దానిపై రాష్ట్ర అసెంబ్లీ ఏ విధంగా స్పందించినా కూడా దాన్ని రాష్టప్రతికి పంపుతారు. తెలంగాణాపై కేంద్రం పంపే డ్రాఫ్టు బిల్లు మెజారిటీ సభ్యులు ఆంధ్ర, రాయలసీమకు చెందిన వారు ఉన్న అసెంబ్లీ ఆమోదించే అవకాశమే లేదు. అందువల్ల మెజారిటీ సభ్యులు బిల్లును తిరస్కరించి పంపుతారు.అదే విషయాన్ని కేంద్రం రాష్టప్రతికి నివేదిస్తుంది. అప్పుడు రాష్టప్రతి నిర్ణయం తీసుకుని రాజ్యా ంగంలోని 3వ అధికరణ ప్రకారం విభజన చేయాల్సిందిగా సూచిస్తూ ేంద్రానికి ఆదేశాలిస్తారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ దశలో రాష్ట్ర అసెంబ్లీ తిప్పిపంపిన తీర్మానంపై బిజెపి లేదా ఇతర పక్షాలు లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ గందర గోళం మధ్య లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయడమో లేదా ఓటింగులో పాల్గొనకపోవడమో భారతీయ జనతా పార్టీ చేయవచ్చు. ఇరు ప్రాంతాలను ఒప్పంచడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని బిజెపి ఆరోపించి బయటకు రావచ్చు.

                  అదే సమయంలో హైదరాబాద్‌పై ఆంక్షలు ఇతర విషయాలను కూడా బిజెపి లోక్‌సభలో ప్రస్తావించి తెలంగాణా ప్రజలను శాంత పరిచే చర్యలు తీసుకునే అవకాశం ఉందని బిజెపి వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇటు తెలంగాణాలో అటు సీమాంధ్రలో కూడా బిజెపికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బిజెపి వాకౌట్‌ చేసినా, ఓటింగులో పాల్గొనక పోయినా కూడా లోక్‌సభలో తెలంగాణా బిల్లు నెగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజ్యసభలో తెలంగాణా బిల్లు నెగ్గే అవకాశం ఎటూ కనిపించడం లేదు.
ఆ ప్రక్రియ జరగాలంటే కాంగ్రెస్‌పార్టీ ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎంత కసరత్తు చేసినా కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌కు సహకరించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఎన్నికలలోపు తెలంగాణా వచ్చే అవకాశాలు లేకుండా పోతాయని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తామే తెలంగాణా ఏర్పాటు చేస్తామని తెలంగాణా ఏర్పాటు కేవలం తమ వల్లే సాధ్యం అవుతుందని బిజెపి ఎన్నికలలో చెప్పుకునే వీలుంది. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని తనం వల్లే తెలంగాణా ఏర్పాటు కాలేదనే అంశాన్ని బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది

No comments:

Post a Comment