Menu bar





Wednesday, November 6, 2013

జీవోయం వద్దు - ఆంద్ర ప్రదేశ్ ఎస్సార్సీ వెయ్యండి

       రాష్ట్రాన్ని ముక్కలు చేసెయ్యడానికి ఉరుకులూ పరుగులూ పెడుతున్న కేంద్ర ప్రభుత్వం - అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు; ఇంకా మాట్లాడితే - అసెంబ్లీని సస్పెండ్ చేసి అయినా, బిల్లు తెచ్చేస్తాం అన్న సర్కారు వారు - హఠాత్తుగా "అఖిలపక్షం" పాట ఎందుకెత్తుకున్నారు? మేము చెప్పిందే ప్రజాస్వామ్యం అన్న వాళ్ళకి - మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు గుర్తుకు వచ్చాయి? వచ్చెనే పో! అన్ని పార్టీలతో మాట్లాడి, అందరూ ప్రేమ లేఖలు ఇచ్చిన తర్వాతే, బిల్లుకు సై అన్నామని డోలుకొట్టి మరీ చెప్పిన వాళ్ళు ... మళ్ళీ విపక్షాలతో మంత్రాంగానికి తలుపులెందుకు తెరిచారు?

దారి తప్పిన వైనం:

అఖిల పక్షాల నిర్వహణ ప్రకటనలో ఒక గందర గోళం ఉంది. అఖిల పక్ష సమావేశం నిజానికి - CWC నిర్ణయానికి ముందే నిర్వహించాలి. cwc నిర్ణయం తర్వాత > కేబినేట్ నోట్ పెట్టిన తర్వాత, జీవోయం నియామకం తర్వాతః - తెలంగాణా ఇచ్చేస్తున్నామని కేంద్రం ప్రకటించిన తర్వాత - తీరికగా - అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చెయ్యడ మేమిటి? దానికి ముందే - జీవోయం రిఫరెన్సులపై రాత పూర్వకంగా అభిప్రాయం చెప్పాలని ఆదేశాలేమిటి? ప్రజల అభిప్రాయంతో కాక, అధినేత్రి నిర్ణయంతో తెలంగాణా ఇచ్చేస్తున్నామని ప్రకటించారు కదా!.ఇంతవరకు బిల్లుకు ఓ రూపం ఇవ్వ లేదు - రాష్ట్రపతికి పంప లేదు! అసెంబ్లీకి రాలేదు - పార్లమెంటుకు వెళ్ల లేదు - రాష్ట్రం ముక్కలు చెయ్యడానికి మాత్రం ఏర్పాట్లు మొదలెట్టేసారు! ఈ తతంగం బాగోలేదని రాష్ట్రపతి చివాట్లు వెయ్యడంతోనే ఈ అఖిల పక్ష నాటకానికి తెర లేచినట్లుంది. అయితే, ఇది మరింత గందరగోళానికే దారి తీస్తుంది!

ఏం చేసి ఉండాలి?

ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం "రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు" పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. అందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాల సేకరణ చేసి - దానికి అనుగుణంగా - బిల్లు ఏర్పరచాలి. అదే సరైన ప్రాతిపదిక అవుతుంది. ఇక్కడ కేంద్రం ప్రజలను బైపాస్ చేసేసింది. పార్టీలు గతంలో ఇచ్చిన ప్రేమ లేఖలనే తెలంగాణా ఏర్పాటుకు ప్రాతిపదిక అంది. పార్టీల అభిప్రాయాలు సేకరించి - ఆ ప్రకారం బిల్లు పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? ఒక పక్క -రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ ఐన అసెంబ్లీ అభిప్రాయమే అవసరమే లేదని, దానిని లెక్కజేయవలసిన అవసరమే లేదని గీరగా మాట్లాడుతున్నవాళ్ళు - ఇప్పుడు అఖిల పక్షం కోసం ఎందుకు హడావిడీ చేస్తున్నారు? అసెంబ్లీకన్నా అఖిల పక్షం ఎట్లా ఎక్కువ?

ఆంటోనీ కమిటీ వేసినప్పుడు - అది కాంగ్రెస్ పార్టీ కమిటీ అని విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ (జీవోయం) వేస్తే - దాని ఎదుట తమ అభిప్రాయాలు ఎందుకు చెప్పరని - కేంద్ర కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది? జీవోయం ప్రతిపాదనలను అంగీకరించినా, తిరస్కరించినా - రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే అవుతుంది. అధినేత్రి నిర్ణయానికి అఖిల పక్ష ముద్ర వేయించుకోడానికే ఈ తతంగమంతా! జీవోయం "విభజన తర్వాత" ఏమి చెయ్యాలో చెప్పమనే అడుగుతోంది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రతిపక్షాలు, చివరకు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలు కూడా ఈ అఖిలపక్ష సమావేశాల ఏర్పాటును తప్పుబట్టాయి.దీనితో మొత్తం వ్యవహారం గందరగోళంలో పడిపోయింది.

జీవోయం ను బహిష్కరించక తప్పదు!

సమైక్య వాదులు కానీ, సమన్యాయ వాదులు కానీ కోరుతోంది - రాష్ట్ర విభజన అవసరమా కాదా అన్నఅంశం పై ప్రజాభిప్రాయం కోరాలని! అందుకోసమే - వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ విద్యార్థీ సంఘాలు, రైతులను ఈ నిర్ణయంలో భాగాస్తులను చెయ్యాలని కోరుతున్నారు. "విభజనకు తీర్పు ఇచ్చేశాం. మీ బాధలు, వాదనలు మాత్రమే చెప్పుకోండి" అంటోంది కేంద్రం! ఇదొక వెటకారం! కాదంటే, కుటిల వ్యవహారం! "తెలంగాణా ఇచ్చేసాం; సంతకాలు పెట్టి వెళ్ళండి" అని అనడమే ఇది! కాంగ్రెస్ విసిరిన ఈ అఖిల పక్ష సవాలును అవకాశంగా తీసుకొని - విపక్షాలు జీవోయం రద్దు కోరాలి! లేదా బహిష్కరించాలి!

జీవోయం వద్దు - ఆంద్ర ప్రదేశ్ ఎస్సార్సీ వెయ్యండి:

రాష్ట్రాల విభజనకు, రీడిజైన్ చేయడానికి నేపథ్యంగా అందుకో బలమైన ప్రాతిపదిక ఉండాలి. అది జనాభిప్రాయానికి దగ్గరగా ఉండాలి. వివిధ సెక్షన్ల ప్రజలను, ప్రజా సంఘాలను ఇందులో భాగస్తులను చెయ్యాలి. విభజన వాదుల ఒత్తిడి రాజకీయం, విద్వేష ప్రచారం, జనాన్ని రెచ్చగొట్టి సృష్టించిన హింసాత్మక వాతావరణం - ఇవే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదిక అయితే, భవిష్యత్తులో అట్లాంటి విప్లవాలు దేశమంతా తలెత్తడం ఖాయం!

పునర్వ్యవస్థీకరణకు - రెండవ ఎస్సార్సీనే ఉత్తమ మార్గం అని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఒకవేళ దేశ వ్యాపితంగా అట్లాంటి వ్యవస్థ చెయ్య లేకపోతే, ఆంద్ర ప్రదేశ్ లో 'అత్యవసర పరిస్థితి' ఉందని అనుకుంటే, అందుకోసం ఏర్పాటు చేసే వ్యవస్థ ' ఎస్సార్సీ కన్నా తక్కువ స్థాయిది' కాకూడదు! అది అధినేత్రి ఇష్టారాజ్యం అసలే కాకూడదు! ఇప్పటికైనా మించి పోయిందేముంది? అఖిల పక్షం జిమ్మిక్కులు మాని - జీవోయం ఎత్తేసి - Special Committee for Re-organization of AP (SCRAP) వెయ్యాలి! అది ప్రజాభిప్రాయ వేదిక కావాలి! దీనికి విరుద్దంగా ఏమి చేసినా అది అధికార పార్టీ దురహంకార పూరిత ఏకపక్ష నిర్వాకమే అవుతుంది.

No comments:

Post a Comment