Menu bar





Monday, September 30, 2013

నన్ను కాపాడండి...... ప్లీజ్

రాజకీయ దగాలో రాష్ర్టం

సమైక్యాంధ్ర ఉద్యమంలో స్థానం లేని నేతలు
రాజకీయ వైఫల్య ఫలితమే ఉద్యమం
గత అనుభవాన్ని మరచిన కాంగ్రెస్‌ అధిష్ఠానం
అయోమయం సృష్టిస్తున్న ప్రతిపక్షాలు
బిజెపి నిర్ణయమూ సందేహాస్పదమే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు కాంగ్రెసు పార్టీ వర్కింగ్‌ కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ పార్టీల, నాయకుల పరిస్థితి ఇబ్బందికరంగా తయార యింది. విభజన ప్రకటన వెలువడిన నాటినుంచి గత 45 రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ‘సమైక్యాంధ్ర ఉద్యమం’లో రాజకీయ పార్టీలు, నాయ కులు, ప్రజాప్రతినిధులకు స్థానం లేకుండా పోయింది. ఉద్యమం చేస్తున్న ప్రజలకు సంఘీభావం తెలియచేయడానికొచ్చే నాయకులు- ప్రజలనుంచి తిరస్కారాలు ఎదుర్కోవలసి వస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు అజ్ఞాతవాసం గడపవలసిన పరిస్థితులు సీమాంధ్ర ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం కొన్ని దశాబ్దాలుగా ప్రత్యక్షం కాని ‘స్వచ్ఛంద ప్రజా ఉద్యమ’మనడంలో సంశయం లేదు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉద్యమం కూడా గొప్పదే కానీ ఆ ఉద్యమానికి రాజకీయరంగు అలముకొని ఉంది.

సీమాంధ్ర ప్రాంతం లక్ష గళ ఘోషలతో, మహిళా గర్జనలతో, మానవహారాలతో, విద్యార్థుల ధర్నాలతో, వ్యాపా రుల ర్యాలీలతో ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండడం చర్చనీ యాంశం. సీమాంధ్ర ఉద్యమానికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయపార్టీల వైఫల్యం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తాము ఎన్ను కొన్న ప్రజాప్రతినిధులు చేతగానివారుగా అక్కడి ప్రజలు భావించడం గమనార్హం. సీమాంధ్ర ప్రజలకు ఆత్మస్థయిర్యం ఇవ్వడంలో ఎపియన్‌జివోలు, ఎపియస్‌ ఆర్‌ట ిసి ఉద్యోగులు, విద్యుత్‌ ఉద్యోగులతోపాటు ఇతర ఉన్నతోద్యోగులు, లాయర్లు, డాక్టర్లు విజయం సాధించినట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రజల మనోభావాలు అంచనా వేయడంలో అన్ని రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారనడంలో సందేహంలేదు.రాజకీయ పార్టీల అభిప్రాయం ప్రకారమే రాష్ట్రాన్ని విభజించామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండడం గర్హనీయం.

ఈ విధమైన ప్రకటన చెసేముందు కాంగ్రెస్‌పార్టీ 2009 డిసెంబరులో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు విస్మరించినట్లుంది. 2009 డిసెంబరు 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పిన తరువాత, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడినవెంటనే సీమాంధ్రప్రాంతంలో నిరసన జ్వాలలు వెలువడ్డాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి, వారి శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యత ఉం టుంది.కేవలం రాజకీయ పార్టీల అభిప్రాయాల ప్రకారం రాష్ట్రాన్ని విభజించడం ప్రజలశ్రేయస్సుకా, పార్టీలశ్రేయస్సుకా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతు న్నాయి కోట్లాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను 12 నెలల కాలం సేకరించి సమర్పించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును కాంగ్రెస్‌పార్టీ కనీసం పరిశీలించన దాఖలాలు కూడా కనిపించడం లేదు.

రాష్ట్ర విభజన విధానంలో శాస్ర్తీయత లోపించినట్లు స్పష్ఠంగా అవగతమవుతోంది. ఇరు ప్రాంతాలలో తమ రాజకీయ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అవగాహనా రాహిత్యంతో తీసుకున్నట్టు రాష్ట్రంలో జరుగు తున్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించిన కారణాన్ని ఇంతవరకు కాంగ్రెస్‌పార్టీ వెల్లడించిన దాఖలాలు లేవు.
విస్తృతస్థాయి చర్చల అనంతరమే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నట్లు దిగ్విజ య్‌సింగ్‌ చెప్పడం గమనార్హం. దీర్ఘకాల చర్చలు, అధ్యయనం తరువాత రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నట్లయితే, ఆంటోనీ కమిటీని ఎందుకు వేసినట్లు? ఢిల్లీలో కూర్చుని కేవలం ఈ పది రోజులలో ఎవరినీ సంప్రదించకుండా ఆంటోనీ కమిటీ సమర్పించే నివేదిక ఏ మాత్రం యోగ్యంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. విభజన ప్రకటన సమయంలోనే టిఆర్‌యస్‌ విలీనం గూర్చి దిగ్విజయ్‌సింగ్‌ ఎందు కు ప్రస్తావించినట్లు? కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని 2009లోనే గట్టిగా నిర్ణయించుకున్నట్లు పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి.

ఇంతకాలం సమ యం కోసం వేచి ఉండి ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలోని రాజకీయపార్టీలతో పాటు స్వీయ పార్టీ ప్రజాప్రతినిధులు ఆత్మరక్షణలో పడి తమను ఇబ్బందులకు గురి చేయరని కాంగ్రెస్‌పార్టీ భావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రల్రోని అన్ని రాజకీయపార్టీలు 2014 ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర విభజ నపై నిర్ణయం తీసుకోరని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పడిన టిఆర్‌ఎస్‌ పార్టీ కూడా తెలంగాణ రాదనే భావనతో 100 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలు సంపాదించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుం టున్నసమయంలో కాంగ్రెస్‌పార్టీ అనూహ్యంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్‌పార్టీ- టిఆర్‌ ఎస్‌ పార్టీనుంచి విలీనహామీ లభించిన తరువాతనే రాష్ట్ర విభజన ప్రకటన వెలువ రించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌పార్టీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కావూరి సాంబశి వరావు, రాయ పాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, చిరంజీవిలతో పాటు ఇతర సీమాంధ్ర మంత్రులను కట్టడి చేయడంలో సఫలీకృతమైంది. ఆరు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయిన కావూరి సాంబశివరావును ఊరిస్తూ వచ్చిన మంత్రి పదవిని విభజన నిర్ణయానికి ముందు ప్రకటించడం, కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్‌ కమిటీ శాశ్వత సభ్యునిగా నియమించడంలో కాంగ్రెస్‌పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కాంగ్రెస్‌వర్కింగ్‌ కమిటీలో సభ్యునిగాఉంటే సీమాంధ్రప్రజల నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని భావించి కావూరి మంత్రి పదవిని ఉంచుకొని కాంగ్రెస్‌వర్కింగ్‌ కమిటీ పదవిని వదులుకున్నట్లు వార్తలు రావడం గమ నార్హం.

ఈ విషయాలన్నీ పరిశీలిస్తే కేంద్ర మంత్రివర్గంలోఉన్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులకు రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ముందే తెలియదంటే నమ్మశక్యంగాని అంశం. ఒక వేళ విభజన నిర్ణయం సీమాంధ్రా మంత్రులకు ముందే తెలియకున్నా, తెలిసినా మంత్రివర్గంలో కొనసాగడం ఏమాత్రం ఉపయోగకరం కాదని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజన అంశంలో అనుసరించిన వ్యూహంలో కొద్దిశాతం విభజన వల్ల ఎదురయ్యే సమస్యల మీద దృష్టి సారించి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉత్పన్నమయి ఉండేవికాదు. శిలాశాసనంగా పేర్కొనే కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్‌ కమిటీ విభజన నిర్ణయ ప్రకటన సమయంలో పొందుపర్చిన అంశాలు అవగాహనా రాహిత్యంతో, అనాలోచితంగా ఉన్నట్లు భావింపవచ్చు. పోలవరంకు జాతీయహోదా కల్పిస్తామని, 10 సంవత్సరాలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధా నిగా ఉంచుతామని, హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను ప్రకటిం చారు.

సీమాంధ్రప్రాంతానికి విభజన వల్ల ఎదురయ్యేది కేవలం నీటి సమస్య, రాజధాని నగరం అనే భావన వెలువరించి కాంగ్రెస్‌పార్టీ తన అస్పష్టతను తేటతెల్లం చేసింది. రాష్ట్ర విభజన ప్రకటన సమయంలోనే ఖచ్చితమైన ముసాయిదాలతో కూడిన ప్రకటన చేసిఉంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కొద్దిగా అయినా జవాబుదారీతనం కనిపించేది.రాష్ట్ర చరిత్రను కాంగ్రెస్‌పెద్దలు లోతుగా అధ్యయనం చేయకపోవడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తాము అనుసరించిన రాజకీయ వ్యూహాలవల్లే సీమాంధ్రప్రాంతంలో ఎటువంటి నిరసనలు వెలువడవని కాంగ్రెస్‌ పార్టీ భావించినట్లు అవగతమవుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీమాం ధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు చూసి కాంగ్రెస్‌పార్టీ అంతర్మథనంలో పడింది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్‌పై మూడు ఆప్షన్స్‌ ఉన్నాయని షిండే ప్రకటించారు.

హైదరాబాద్‌ గురించి కూడా కేంద్రం లోతుగా అధ్యయం చేసి స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది. హైదరాబాద్‌ జిల్లా, 650 చ.కి.మీ వైశాల్యం కలిగిన గ్రేటర్‌ హైదరాబాదు మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జి.హెచ్‌.యం.సి), 7,257 చ.కి.మీ. వైశాల్యం కల్గిన హైదరాబాద్‌ పట్టణాభివృద్థి సంస్థ (హెచ్‌.యమ్‌.డి.ఎ) లు ఉన్నాయి. దీనిలో 650 చ.కి.మీ.లు జి.హెచ్‌.యమ్‌.సి.లో హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7,257 చ.కి.మీ వైశాల్యం కల్గిన హెచ్‌.యమ్‌.డి.ఎ. పరిధిలో హైదరాబాద్‌లోని 16 మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని 23 మండలాలు, మెదక్‌ జిల్లాలోని 10 మండలాలు, నల్గొండ జిల్లాలోని 5 మండలాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 2 మండలాలు ఉన్నాయి. హెచ్‌. యమ్‌.డి.ఎ. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పట్టణాభివృద్థి సంస్థగా పేరొందిం ది.

సీమాంధ్రప్రాంతంవారు కేవలం హైదరాబాద్‌ నగరపరిధిలోనే కాక హెచ్‌. యమ్‌.డి.ఎ. పరిధిలోని అన్ని జిల్లాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాల ద్వారా విస్తరించిఉన్నారు. తెలంగాణలోఉన్న సీమాంధ్రులను తెలంగాణ ప్రాంతం లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారితో పోల్చడం సమంజసం కాదు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ఇన్ని రోజులు ‘కామన్‌ బడ్జెట్‌’గా ఆంధ్రప్రదెశ్‌ రాష్ట్రంలో ఉండి, హైదరాబాద్‌ నగరానికి ఎక్కువ నిధులు వెచ్చించి అభివృద్థి చేసిన విషయం పరిగణనలోకి తీసుకోవలసిన అంశం. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదాయమెంత? దానిలో సీమాంధ్రుల పాత్ర, పెట్టుబడులుకూడా విస్మరించ జాలని అంశాలు. ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన హైదరా బాద్‌తో కూడిన 10 తెలంగాణ జిల్లాలతో కూడిన ప్రకటనను పునఃసమీక్షించి హెదరాబాద్‌పై కొత్త ఆప్షన్లను పరిశీలించాలి. హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచాలంటే ఖచ్ఛితంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి. దీనివల్ల ఇరుప్రాంతాలకు ఏమాంత్రం ఉపయోగం ఉండదు.

కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయంలో బిజెపి, యమ్‌ఐయమ్‌, టిఆర్‌యస్‌ పార్టీలతో పాటు తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌పార్టీ ఎదుర్కోవలసి వస్తుంది. ఎటువంటి హక్కులులేకుండా హైదరాబాద్‌లో రాజధానిని ఒక్కరోజు కొనసాగిం చడం కూడా సీమాంధ్రులకు ఉపయోగకరం కాదు. రాజధానికి హైదరాబాద్‌లో ఎటువంటి హక్కులు లేకుండా తాత్కాలికంగా లేక శాశ్వతంగా కొనసాగించడం వల్ల సీమాంధ్రప్రాంతంలో అభివృద్థి విషయంలో నిర్లక్ష్య వైఖరి కొనసాగే ప్రమాదం ఉంది. 34 శాసనసభ, 5 పార్లమెంటు స్థానాలను కలిపి హైదరాబాద్‌ ప్రత్యేక రాష్ట్రం గా చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా చేస్తారనే వార్తలు కూడా గుప్పు మంటున్నాయి. హైదరాబాద్‌ను రాష్ట్రంగా విడదీస్తే సీమాంధ్ర, తెలంగాణలకు రాజ ధానులు ఏర్పరుస్తారా? లేక హైదరాబాద్‌లోనే శాశ్వతంగా ఉంచుతారా? అనే స్పష్ఠత లేదు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చెయ్యాలనే వాదన కూడా తెరమీదకు వచ్చింది.

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ దేశ రెండవ రాజధానిగా దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్‌ నగరాన్ని గతంలోనే సూచించి ఉన్నారు. కానీ ఉత్తర భారతదేశానికి చెందిన నేతలు దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌లో దేశ రెండవ రాజధానిని నెలకొల్పే ఔదార్యం చూపుతారంటే నమ్మ శక్యంకాని విషయం. హైదరాబాద్‌ను దేశ రెండవ రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రంలోని జరుగుతున్న పరిణామాలకు చాలా వరకు పరిష్కారం లభించే అవకాశముంది. తెలంగాణ జిల్లాలో నిన్నటివరకు బలపడుతూ వచ్చి రాష్ట్ర విభజన ప్రకటనతో డీలా పడిన బిజెపి విషయంలోకూడా జాగ్రత్త పడవలసిన అవసరం కాంగ్రెస్‌పార్టీ మీద ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి తమకే దక్కుతుందని భావిస్తూవస్తున్న బిజెపికి కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం షాక్‌ ఇచ్చినట్లయింది. తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ కొస్తున్న ఆదరణను బిజెపి జీర్ణించుకోలేకుంది. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌పార్టీ ఏ చిన్న సవరణలు చేసినా, కమలదళం యుటర్న్‌ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇదే జరిగితే తెలం గాణ బిల్లు అటకెక్కడంఖాయం. రాయలసీమ ప్రాంతవాసులు 56 సంవత్సరాల క్రితం రాజధానిని త్యాగంచేసి నష్టపోయిఉన్నారు. ఆ జిల్లాల్లో తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆందోళనలకు ఇదే కారణంగా భావించవచ్చు. ఇకనైనా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ అవసరాలను ప్రక్కనబెట్టి సీమాంధ్ర, తెలంగాణ జిల్లాల్లోని ప్రజల క్షేమం దృష్ట్యా సహేతుకమైన నిర్ణయం తీసుకుని రెండు ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. తెలుగుదేశం, వై. యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీలు కూడా రాజకీయ విమర్శలతో ప్రజలను అయోమయానికి గురిచేయకుండా ఇరు ప్రాంతాలలోని ప్రజకు అండగా నిలవవలసి ఉన్నది.

No comments:

Post a Comment