Menu bar





Monday, October 14, 2013

10 జనపథ్ వద్ద చుక్కలు చూపిన తెలుగు మహిళలు

                    తెలుగు దేశం పార్టీకి చెందిన తెలుగు మహిళలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటిని ముట్టడించి పోలీసులకు చుక్కలు చూపించారు. శనివారం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షను భగ్నం చేయడంతో తెలుగు మహిళలు సోనియా ఇంటిని ముట్టడించారు. మొదట టిడిపి ప్రజాప్రతినిధులు సోనియా ఇంటిని ముట్టడించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుగు మహిళలకు తెలిసింది. విషయం తెలియగానే తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో మహిళా నాయకులు 10 జన్‌పథ్‌కు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఇటలీ లేడీ.. సోనియా కేడీ అంటూ నినాదాలు చేశారు. మహిళా పోలీసులు తక్కువగా ఉండటంతో వీరిని అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించడం ఇబ్బందిగా మారింది. అక్కడే బైఠాయించిన వారు అరగంట తర్వాత ఒక్కసారిగా లేచి సోనియా ఇంటిలోకి జొరబడే యత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ.. సోనియాకు మంచిగా చెబుతుంటే అర్థం కావటం లేదని, అందుకే ఆమె ఇంటికే వచ్చి తెలుగు ప్రజల గోడు వినిపిస్తున్నామన్నారు. ఆమె దేశాన్ని నడిపిస్తున్న నాయకురాలే అయితే, ప్రజల కోసం పని చేసే నాయకురాలే అయితే తక్షణం బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ఇంట్లో ఎందుకు దాక్కుంటోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. తెలుగు ప్రజలతో ఆటలాడుకుంటున్న ఆమె తెలుగు జాతికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. సోనియా కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పకపోతే ఇటలీ వరకూ వెంటపడి తరుముతామన్నారు.

No comments:

Post a Comment