Menu bar





Saturday, October 12, 2013

చిత్తశుద్ధి లేని శివపూజలేందుకు ...రాజీనామాలేందుకు!

లక్షలాది ప్రజలు, ఉద్యోగులు సమైక్యాంధ్ర కోరుతూ గత రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నపటికీ, ఇంతకాలంగా తమ కేంద్రమంత్రి పదవులు వదిలిపెట్టడానికి ససేమిరా అంటున్న చిరంజీవి, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిన్నహోంమంత్రిని, ప్రధానిని కలిసిన తరువాత రాజీనామాలు సమర్పించారు. తమ సెక్యురిటీ, వాహనాలు, ఇతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి, తమ రాజీనామాలు ఆమోదించినా లేకపోయినా ఇక పదవులలో కొనసాగబోవడం లేదని స్పష్టం చేసారు. కేంద్రమంత్రులు పల్లం రాజు, కావూరి, కిల్లి క్రుపారాణీలు కూడా హోంమంత్రిని, ప్రధానిని కలిసినపటికీ వారు తమ రాజీనామాలకై ఒత్తిడి చేయలేదని సమాచారం.

ఇంతకాలంగా రాష్ట్రవిభజనను అడ్డుకొనేందుకు తాము పదవులలో కొనసాగడం అవసరమని చెపుతూ వచ్చిన వీరు, సరిగ్గా అదే మిషతో రాష్ట్ర విభజనకు కడవరకు కేంద్రానికి సహకరించి ఇప్పుడు రాజీనామాలు చేస్తుండటం విశేషం. దానివల్ల రాష్ట్రవిభజన ఆగదని కూడా వారికీ బాగా తెలుసు. విభజన ప్రక్రియ మొదలయిపోయిన తరువాత చేస్తున్నఈ రాజీనామాలు కేవలం ప్రజాగ్రహానికి గురి కాకూడదనే తప్ప విభజనకు వ్యతిరేఖంగా కాదని చిరంజీవి చెప్పిన ఈ మాటలు “ఇప్పటికయినా రాజీనామాలు చేస్తే తప్ప మేము ప్రజలలోకి వెళ్ళ లేమని” స్పష్టం చేస్తున్నాయి.

ఇక కేంద్రమంత్రులు యంపీలు తమ రాజీనామాలు ఆమోదింపజేసుకోలేని పక్షంలో కనీసం తమ అధికారిక వాహనాలను, అధికార నివాసాలను ప్రభుత్వానికి అప్పగించేసే వారి వారి నియోజక వర్గాలకు తిరిగివచ్చేయాలని ఏపీయన్జీవోలు చేసిన డిమాండ్ ప్రభావం కూడా మంత్రులపై కనబడుతోంది. అదేవిధంగా తాము ఇక కేంద్రమంత్రులను, యంపీలను ఎంతమాత్రం విశ్వసించడం లేదని, “కనీసం శాసనసభ్యులయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషిచేస్తామని” వారి వారి నియోజకవర్గాలలో ఈనెల 10,11,12 తేదీలలో ప్రజల ముందు ప్రమాణాలు చేయాలని కోరడం కూడా కేంద్రమంత్రులకు రాజీనామాలు చేయక తప్పనిసరి పరిస్థితి కల్పించింది.

ఇదంతా గమనిస్తే మంత్రులు కేవలం ఏపీ యన్జీవోల ఒత్తిడి కారణంగానే ఇప్పుడు రాజీనామాలు చేసి తమ రాజకీయ జీవితాన్నికాపాడుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్దితో లేదా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తోనో కాదని స్పష్టం అవుతోంది. ఇప్పటికీ ప్రధాని వారి రాజీనామాలు ఆమోదించని కారణంగా వారి పదవులకొచ్చిన ప్రమాదం కూడా ఏమీ లేదు. రేపు పరిస్థితులు చక్కబడితే మళ్ళీ వీరే స్వయంగా వెళ్లి మంత్రుల కమిటీతో చర్చలకు కూర్చొన్నాకూడా ఆశ్చర్యం లేదు.

No comments:

Post a Comment