Menu bar





Thursday, October 17, 2013

సిఎం చేతులెత్తేసినా సమ్మె విరమణ: తాత్కాలికమే

                హైదరాబాద్‌: సమైక్యాంధ్ర కోసం తాను హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ ఎపి ఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం వారు గురువారం ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎపి ఎన్జీవోల సంఘం, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు గురువారం ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. చర్చల అనంతరం వారు సమావేశమై తాత్కాలికంగా సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి విధులకు హాజరు కావాలని ఎపిఎన్జీవోలు, ఇతర సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. విధుల్లో చేరుతామని ఉద్యోగులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఉద్యోగులతో చర్చలు ఫలించాయని ఆయన చెప్పారు. సమ్మె విరమణ తాత్కాలికమేనని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదిస్తే వెంటనే మెరుపు సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు.

        తాము సమ్మె విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎపిఎన్జీవోల నిర్ణయానికి ముందే ప్రకటించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు చెప్పారు. అవసరమని భావిస్తే తిరిగి సమ్మెలో చేరుతామని వారు చెప్పారు. రాష్ట్రం సమైక్యం కోసం చట్ట సభల్లో పోరాడతామని సీఎం చెప్పారని, సీఎం విజ్ఞప్తి మేరకు తాము సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ జేఏసీ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసి ఉద్యోగులు ఇప్పటికే సమ్మె విరమించారు. దీంతో గత 66 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెర పడింది. రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని ముఖ్యమంత్రితో చెప్పామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం పరిధిలో ఉన్న విషయాలపై తాను హామీ ఇవ్వలేనని సిఎం చెప్పారని, తాను ముఖ్యమంత్రిగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని చెప్పారని, తీర్మానం అసెంబ్లీకి వస్తే దాన్ని ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని కూడా చెప్పారని ఆయన వివరించారు. 
          విభజున వల్ల ఉద్యోగులకు జరిగే నష్టంపై తాను కేంద్రానికి నివేదిక ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. 371డి ఉన్నంతకాలం రాష్ట్రాన్ని విభజించడానికి వీలు లేదని ఆయన అన్నారు. ఉద్యోగులకు రక్షణ కల్పించిన 371డిని తొలగించే హక్కు కేంద్రానికి లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన అన్నారు. ఉద్యోగులు మళ్లీ సమ్మె చేయాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు. తీర్మానం, అభిప్రాయ సేకరణ రెండూ అసెంబ్లీలో ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీలో, పార్లమెంటులో విభజనకు ఏదో దశలో అడ్డు పడే అంశాలు చాలా ఉన్నాయని అశోక్ బాబు అన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు. సమ్మె కాలానికి తాము వేతనం అడగలేదని ఆయన చెప్పారు. రాజకీయ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, రాజకీయంగా మైండ్ గేమ్ జరుగుతోందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం వరకే సమ్మెను విరమిస్తామని, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మళ్లీ సమ్మెకు దిగుతామని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment