Menu bar





Tuesday, October 1, 2013

రాహుల్ ఇదీ చంచేయ్!

డియర్ రాహుల్!

నేరనిరూపణ జరిగిన వారు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు కల్పించేందుకు మీ పార్టీ తీసుకొస్తున్న ఆర్డినెన్సును "ఇదంతా నాన్సెన్స్!" అంటూ చించి ముక్కలు చేసేసిన మీ సాహసానికి జేజేలు! అయితే, మీరు తక్షణమే చించి పోగులు పెట్టవలసిన మరో "నాన్సెన్స్ తీర్మానం" ఉంది. అదే cwc చేసిన ఆంద్రప్రదేశ్ విభజన తీర్మానం!

దయచేసి ఆ తీర్మానాన్ని కింది వాస్తవాలతో పోల్చి చూసి, చక్కగా పరిశీలించితే, ఇదో చెత్త తీర్మానం అని గ్రహించి మీరు దాన్ని అగ్గిపుల్ల అంటించి కాల్చి బూడిద చేస్తారనే నేను భావిస్తున్నాను:

నేపథ్యం:

>> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ప్రత్యేక తెలంగాణా' కావాలని కొద్ది కాలంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. 2009 ఎన్నికలలో - కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశాన్ని ప్రస్తావించి రెండో ఎస్సార్సీ ద్వారా సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది.
>> కానీ, తెరాస పార్టీ, రాజకీయ జేఏసీ పేరిట కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, మావోయిస్టు అనుబంధ సంఘాలు, వాటి సానుకూల సంస్థలు, బీజేపీ, ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు - ఇవన్నీ కలిపి - తెలంగాణలో ఒక అప్రకటిత నిర్బంధ వాతావరణం నిర్మించాయి.
>> ఆ రకంగా, తెలంగాణాలో ఏ పార్టీ పనిచెయ్యాలన్నా - తెలంగాణా విభజనకు అంగీకరించ వలసిందేనన్న'ఒత్తిడి రాజకీయాలు' ప్రారంభించాయి.
>> తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా - ఆ ఒత్తిడికి తలొగ్గి - తీవ్రవాదంతో కూడిన విభజన రాగం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు భిన్నంగా - రెండో ఎస్సార్సీతో సంబంధం లేకుండానే - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యాలని ఉద్యమాలు మొదలు పెట్టారు.
>> తెలుగు దేశం, వైసీపి పార్టీలు కూడా ఈ ఒత్తిడి రాజకీయాలకు తలొగ్గి - తాము కూడా తెలంగాణాకు అనుకూలమే అని ఉత్తరాలు ఇచ్చాయి.

తప్పుపై తప్పు:

>> తెలంగాణా కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని ఇక్కడ తప్పు దారి పట్టించారు. అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా ఉత్తరాలు రాసారు కాబట్టి, తెలంగాణా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చేస్తే - ఆ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే వస్తుందని చెప్పారు. పైగా - తెలంగాణా ప్రకటన చేస్తే - కెసీఆర్ తెరాసా పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడని నమ్మించారు.
>> తెలంగాణా ప్రకటనకు దాదాపు మెజారిటీ పార్టీలన్నీ అంగీకరించాయి కాబట్టి సీమాంధ్ర ప్రాంతంలో ఎట్లాంటి వ్యతిరేకతా రాదాని నమ్మబలికారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు తాయిలాలిస్తే వాళ్ళు కూడా అడ్డం రారని సలహా ఇచ్చారు. అ విధంగా 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని టే కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని ఒప్పించారు.
>> వాళ్ళ మాటలు కరెక్టే అని చెప్పి దిగ్విజయ సింగ్ వంటి వృద్ధ మేజర్లు చెప్పిన మీదట, cwc ఆఘమేఘాలపై రాష్ట్ర విభజన తీర్మానం చేసింది. అయితే, వాళ్ళెవ్వరూ సరైన నిజాలు చెప్పలేదని ప్రస్తుత రాష్ట్ర పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.

రాజ్యాంగ ప్రక్రియకు విఘాతం:

>> రాష్ట్ర విభజన వంటి సున్నిత సమస్యను - నిర్దిష్ట రాజ్యాంగ ప్రక్రియ అనుసరించి మాత్రమే చెయ్యాలి. లేకపోతే. దేశమంతటా విపత్కర పరిణామాలు ఏర్పడతాయి. ఆదరాబాదరా చేసిన cwc తీర్మానం ఈపాటికే దేశంలో అనేక రాష్ట్రాలలో విభజన ఉద్యమాలను ఉసిగొల్పింది.
>> అన్ని పార్టీలూ తెలంగాణా అనుకూల వైఖరి ప్రకటించినా - ప్రైవేటు పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు. అది రాజ్యాంగ బద్ధం కాదు; రాజ్యాంగ వ్యవస్థల ప్రతిపత్తికి భంగం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదిస్థానం కూడా తీర్మానించ కూడదు.
>> కానీ, ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన మీ పార్టీ మేనేజర్లు - తప్పుడు సలహాలిచ్చి - తొందరపాటు నిర్ణయాలు చేయించి, పార్టీ అధినేతను ఇబ్బందులలోకి నెట్టేశారు. cwc తీర్మానం తర్వాత సీమాంధ్రలో రగుల్కొన్న 'సమైక్యాంధ్ర ఉద్యమాలు - ' తెలంగాణా ఇచ్చేసామనే విధంగా తీర్మానం చెయ్యడం' తప్పేనని రుజువు చేస్తున్నాయి.

ఏమి చేసి ఉండాలి?:

>> "రెండవ ఎస్సార్సీ నిర్ణయం ద్వారా తెలంగాణా ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ రాష్ట్ర విభజన వెంటనే జరగాలని వివిధ పార్టీలు సూచించిన మేరకు - ప్రజాభిప్రాయం తెలుసు కునేందుకు వీలుగా రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించడానికి cwc తీర్మానిస్తున్నది. ఈ విషయమై కేబినేట్ నోట్ తయారీకి వీలుగా - విభజనకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణకై ఒక కేబినేట్ కమిటీ ఏర్పాటుకు, తర్వాత మిగతా రాజ్యాంగ ప్రక్రియలు అమలు చేయడానికీ తీర్మానిస్తోంది": - ఈ విధంగా నిర్ణయిస్తే, ప్రస్తుత సంక్షోభం తలెత్తేది కాదు.
>> కేబినేట్ కమిటీ ప్రజలందరినీ కలిసి అభిప్రాయ సేకరణ చేసి నివేదిక ఇచ్చేది. దాని ప్రకారం కేబినేట్ నోట్ తయారై, మొదట రాష్ట్ర పతికి, తర్వాత అసెంబ్లీకి, తర్వాత పార్లమెంటుకు వచ్చేది.
>> పార్లమెంటు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా - విభజన సమస్య రాజ్యాంగబద్ధంగా పరిష్కార మయ్యేది. కానీ ఇప్పుడు cwc తీర్మానం ఒక అప్రజాస్వామిక చర్యగా నిరూపితమయ్యింది. అది రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చేసింది.
>> అప్రజాస్వామికంగా, రాజ్యాంగ నిబద్ధత లేకుండా cwc తానే సుప్రీం అన్నట్లుగా "తెలంగాణా ఇచ్చేశాము" అని ప్రకటించడం వలన కాంగ్రెస్ పార్టీ నవ్వులపాలయ్యింది.
>> సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని లెక్కచేయని సంక్షోభంతో కూడిన రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది.
>> గత 63 రోజులుగా సీమాంధ్ర ప్రజలు లక్షలలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, "అవును - కాదు" అని చెప్పలేని విచారకర పరిస్థితిలో అధిష్టానం పడిపోయింది. అధినేతకు ఇదంతా పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
>> ఒక ప్రాంత ప్రజల మెడపై పదునైన కత్తిపెట్టి, విభజనకు ఒప్పుకొని తీరాలి అనడం ఎట్టి పరిస్థితులలోనూ ప్రజాస్వామిక చర్య కాదు. ఇది రాజ్యాంగ ప్రక్రియను భ్రష్టు పట్టించడం కూడా!

తక్షణ కర్తవ్యమ్:

>> కాంగ్రెస్ యువనేతగా, విప్లవాత్మక భావాలున్న భావితరం దూతగా - మీకు గొప్ప భావాలున్నాయి. వ్యవస్థలను దెబ్బతీయడానికి మీరు వ్యతిరేకం అని నేరస్తుల ఆర్డినెన్స్ కాపీని చించి పోగులు పెట్టడమే నిదర్శనం. ఇప్పుడు మీ గొప్ప వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే మరో సదవకాశం వచ్చింది.
>> cwc తెలంగాణా తీర్మానం కూడా నేరస్తులకు రాజకీయ అర్హత కలిగించే ఆర్డినెన్స్ వంటిదే కనుక, ఈ తీర్మానాన్ని కూడా అగ్గిపుల్ల వెలిగించి కాల్చివేయడమే అత్యుత్తమం. అట్లాంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం రాహుల్ మాత్రమే తీసుకోగలరని, ముసలి మేనేజర్ల తప్పుడు సలహాలనుంచి కాంగ్రెస్ పార్టీని, తద్వారా దేశాన్ని కాపాడగలరనీ విజ్ఞప్తి చేస్తున్నాను.

No comments:

Post a Comment