Menu bar





Thursday, October 17, 2013

నో విలీనం!: సర్వేల ఉత్సాహంతో కాంగ్‌కు కెసిఆర్ ఝలక్!

                అధికార కాంగ్రెసు పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి ఝలక్ ఇచ్చింది. పార్లమెంటులో బిల్లు పెడితే విలీనం అంశాన్ని పరిశీలిస్తామని ఇన్నాళ్లు చెప్పిన తెరాస ఇప్పుడు పరోక్షంగా కాంగ్రెసు పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తమ పార్టీ విలీనం కాదని పేర్కొంది. తెరాస ఈ నిర్ణయం కాంగ్రెసు పార్టీకి ఊహించని షాకే అని చెప్పవచ్చు. గురువారం తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ విలీనం పైన స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి భౌగోళిక తెలంగాణ కోసమే పుట్టలేదని, రాష్ట్ర పునర్మిర్మాణంలోను ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతోనే సాధ్యమని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు.
                    
                   పునర్నిర్మాణంపై తాము ఇప్పటికే కొంత కార్యాచరణ ప్రకటించామని, త్వరలో మరికొంత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఎలాంటి త్యాగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెరాస పోరాటం చేసిందని, భవిష్యత్తులోను పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. తెరాస 13 ఎంపీ స్థానాలలో గెలుస్తుందని టైమ్స్ నౌ సి ఓటర్ సర్వే ఇచ్చిన రిపోర్టుతో తమ పార్టీ బాధ్యత మరింత పెరిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు ఎలాంటి రాష్ట్రం కోరుకుంటున్నారో ఆ దిశగా తెరాస పోరాడుతుందన్నారు. తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చట్టాల పైన గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రాంత టిడిపి నేతలు చరిత్రహీనులుగా మిగలవద్దని, ఆ పార్టీ నుండి బయటకు రావాలన్నారు. తాము పదవుల కోసం పాకులాడే వారం కాదన్నారు.

No comments:

Post a Comment