మన
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బాధ్యతారాహిత్యంగా ఇంతకాలం
వ్యవహరించాయి.ఓట్ల రాజకీయంలోపడి ఏదో ఒక వాగ్దానం చేయడం, ఆ తర్వాత నాలుక
కరుచుకోవడం అలవాటైన ఈ పార్టీలు చివరకు తెలంగాణ అంశాన్ని కూడా ఆ ప్రకారమే
చూడడంతో ఇప్పుడు రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం
సరైనదా?కాదా అన్న చర్చ ఇప్పుడు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు.తెలుగు
జాతిని విచ్చిన్నం చేశారని బాధపడినా ప్రయోజనం లేదు.కాంగ్రెస్,తెలుగుదేశం
పార్టీలు దీనిని ఒక క్రీడగా మార్చి గత దశాబ్దకాలంగా దీని చుట్టూ రాజకీయం
చేశాయి. పైకి ఒకటి,లోపల ఒకటి పెట్టుకుని వ్యవహరించాయి. అందువల్లనే ఇది ఒక
పెద్ద సంక్షోభంగా మారింది.కాంగ్రెస్ పార్టీ ముందుగా రెండో ఎస్.ఆర్.సి అంది.
ఆ తర్వాత ప్రణబ్ కమిటీ అంది.ఆ తర్వాత సూత్రప్రాయంగా తెలంగాణకు
ఒప్పుకుంటున్నామని, కాని భాగస్వాములందరితోను అనేక అంశాలపై చర్చలు జరిపి ఆ
తర్వాత అంతిమ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.కాని ఆ తర్వాత తెలంగాణ
నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత సీమాంద్ర కాంగ్రెస్
ఎమ్.పిలు,ఎమ్మెల్యేలు అంతా తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు
అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తెలంగాణ నిర్ణయం
వెలువడిన తర్వాత సీమాంద్ర తెలుగుదేశం నేతలు కాంగ్రెస్ తో పోటీ పడి ఉద్యమం
చేశారు.రెండువేల తొమ్మిది డిసెంబరు తొమ్మిదిన తీసుకున్న నిర్ణయం ఇరవైమూడు
నాటికి ఆగిపోయింది.ఆ తర్వాత మళ్లీ గేమ్ మొదలైంది.
No comments:
Post a Comment