కేబినేట్ నోట్ అంతా ఉల్టా-పల్టా! ఇందులో మతలబేమిటి?
నైజాం రాజ్యాన్ని 1948 సెప్టెంబర్ 17న విమోచనం చేసి భారత యూనియన్ లో కలిపినప్పటికీ, హైదరాబాద్ స్టేట్ - 26 జనవరి 1950లో ఏర్పడింది. 1952లో హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ ఏర్పడింది. 1956 నవంబర్ 1న హైదరాబాద్ స్టేట్ లోని 16 జిల్లాలలో నుంచి మరాఠీ, కన్నడ ప్రజలతో కూడిన 10 జిల్లాలను వేరు చేసి కొంత భాగాన్ని మహారాష్ట్రలోనూ, కొంత భాగాన్ని కర్నాటకలోనూ కలిపారు. మిగిలిన హైదరాబాద్ స్టేట్ లో - అప్పటికే ఆంధ్ర రాష్ట్రం పేరుతో ఉన్న రాయలసీమ, కోస్తా ప్రాంతాలను కలిపి -'ఆంధ్రప్రదేశ్' అనే కొత్త పేరుతో, కొత్త 'భాషా ప్రయుక్త రాష్ట్రం' ఏర్పరిచారు.
అంటే 1950 నాటి హైదరాబాద్ స్టేట్ లోని కొన్ని ప్రాంతాలను కర్ణాటకలో, మహారాష్ట్రలో కలపగా, మిగిలిన హైదరాబాద్ స్టేట్ లో (రెసిడ్యువల్ స్టేట్) లో - అంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపారు. దరిమిలా విస్తృతమైన హైదరాబాద్ రాష్ట్రానికి 'ఆంధ్రప్రదేశ్' అని పేరు మార్చారు.
అంటే ఏం జరిగింది? హైదరాబాద్ రాష్ట్రం 1950 జనవరి 26 నుంచి అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తోంది. 1950లో దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు. 1956 నవంబర్ 1 నుంచి దానికి ఆంధ్రప్రదేశ్ అని పేరు మార్చారు. ఏతావాతా - 'ఆంధ్రప్రదేశ్' అని నేడు పిలవబడుతున్ననాటి హైదరాబాద్ రాష్ట్రం - కొన్ని భాగాలను వదలుకొని, మరి కొన్ని ప్రాంతాలను కలుపుకొని - అవిచ్చన్నంగా కొనసాగుతూ వస్తోంది.
ఇప్పుడు తెలంగాణా విభజన వాదుల 'స్వయం నిర్ణయాధికారం' డిమాండ్ ప్రకారం రాష్ట్ర విభజన చేస్తే ఏమవుతుంది?
'ఆంధ్రప్రదేశ్' అని నేడు పిలవబడుతున్న 'హైదరాబాద్ రాష్ట్రం' లో - 1956లో - నాటి ఉభయ శాసనసభల తీర్మానం ద్వారా కలిపిన - పూర్వపు ఆంద్ర ప్రాంతాలను, అంటే, రాయలసీమ, కోస్తా ప్రాంతాలను - ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉరఫ్ హైదరాబాద్ స్టేట్ నుంచి - విడదీయవలసి వస్తుంది. అంటే, విభజన తర్వాత - ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉరఫ్ హైదరాబాద్ స్టేట్ - కొనసాగే రాష్ట్రంగా (Residual State) అట్లాగే మిగిలి ఉంటుంది.
కాగా, మరోపక్క, ''సీమాంధ్ర' అని ఇటీవలి కాలంలో పిలవబడుతున్న రాయల సీమ, కోస్తా ప్రాంతాలను విడిగొట్టి/చీల్చి - మరొక కొత్త రాష్ట్రంగా - ఏర్పరుస్తారు. అంటే, భారత రాష్ట్రాల సమాఖ్యలో (ఇంకా పేరుపెట్టబడని) 29వ రాష్ట్రం - ఆర్టికల్ 3 (a) ప్రకారం ఏర్పడుతుంది. అట్లాగే 3 (e) ని అనుసరించి కొనసాగే 'ఆంధ్రప్రదేశ్ స్టేట్' ఉరఫ్ 'హైదరాబాద్ స్టేట్' - ఇకపై "తెలంగాణా స్టేట్' అనే పేరుతో పిలవబడుతుంది.
కేబినేట్ నోట్ లో ఉల్టా పల్టా ఎందుకయ్యింది?
కానీ, కేబినేట్ నోట్ లో - విడిపోతున్న రాయలసీమ, కోస్తా ప్రాంతాలనే 'కొనసాగే రాష్ట్రం (Residual State) గా' పేర్కొన్నారు! ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉరఫ్ హైదరాబాద్ స్టేట్ నుంచి - ఒక రాజ్యాంగ అస్తిత్వం కానీ, ఒక రాష్ట్ర స్వరూపం కానీ, ఒక రాజధాని కానీ లేకుండా విడగొట్టబడుతున్న ప్రాంతం - 'కొనసాగే రాష్ట్రం (Residual State)' - ఎట్లా అవుతుంది? 1950 నుంచి కొనసాగుతూ వస్తున్న హైదరాబాద్ స్టేట్ - అంటే - నేటి ఆంధ్ర ప్రదేశ్ - కొన్ని భాగాలను కోల్పోయి - రేపు తెలంగాణా గా ఏర్పడుతుంది. అంటే - పాత హైదరాబాదు స్టేట్ - 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరుతోనూ, విభజన జరిగితే, 2014లో తెలంగాణా స్టేట్ పేరుతోనూ కొనసాగుతూ ఉంటుంది. కానీ, కేబినేట్ నోట్ తెలంగాణా ఒకకొత్త రాష్ట్రం అంటోంది. నిజానికి, పాలనాపరమైన సహజ సూత్రాలకు ఇది విరుద్దం, అసంబద్ధం!
రాష్ట్ర విభజన అంటూ జరిగితే - 7వ షెడ్యూలులో 1వ రాష్ట్రంగా ఉన్న 'ఆంధ్రప్రదేశ్', ఆర్టికల్ 3(e) ప్రకారం 'తెలంగాణా రాష్ట్రం' గా పేరు మార్చుకొంటుంది. 29వ రాష్ట్రమొకటి కొత్తగా ఏర్పడుతుంది. అయితే, దానికి పేరు లేదు; రాజధాని లేదు; రాజ్యాంగ అస్తిత్వం లేదు! ఉన్నదల్లా రాజకీయ నాయకుల చేతుల్లో మోసగించబడిన దిక్కు తోచని ప్రజలు, గత 56 సంవత్సరాలుగా అనేక రకాలుగా వెనుకబడిన కొంత భూభాగము మాత్రమే! ఇట్లాంటి ఒక రాష్ట్రం తమకు ఏర్పాటు చెయ్యమని ఆ ప్రాంత ప్రజలు ఎన్నడూ కోరలేదు. అందుచేత దానికి ఏమి పేరు పెట్టాలనే ఆలోచనే లేదు! రాజధాని ఎక్కడ ఉండాలనే తీర్మానమే లేదు!
ఆ ప్రాంత ప్రజల కోరిక లేకుండా, అందుకు సంబంధించిన విజ్ఞాపన లేకుండా, వాళ్లకి ఇష్టం లేకుండా - కనీసం వాళ్ళతో చర్చించకుండా, కొత్త రాష్ట్రం మాకొద్దు, మమ్మల్ని విడదీయ వద్దు అని మొత్తుకుంటున్నా, కొనసాగుతున్న హైదరాబాద్ స్టేట్ ఉరఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బలవంతంగా తన్ని తరిమేస్తున్నారు. కొనసాగుతున్న తెలంగాణా కోరుతున్న వాళ్ళు, పూర్వ హైదరాబాద్ స్టేట్ కు పెట్టిన 'ఆంధ్రప్రదేశ్' పేరు తమకు వద్దంటున్నారు కాబట్టి, అన్న వదిలేసినా చొక్కా తమ్ముడికి ఇచ్చినట్లుగా, వదిలేసిన 'ఆంధ్రప్రదేశ్' పేరును, కొత్త రాష్ట్రానికి తగిలించేసి కేబినేట్ నోట్ వండేసారు! అంటే, కనీసం తమ రాష్ట్రానికి పేరుపెట్టుకునే అర్హత కూడా లేని దిక్కుమాలిన సంత అయ్యిందన్నమాట - రాయలసీమ - కోస్తా ప్రాంతం!
ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత నికృష్టంగా, ఇంత నిరంకుశంగా, ఒక రాష్ట్రం ఏర్పరిచిన సందర్భాలు ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్నాయా? నిపుణులే తేల్చి చెప్పాలి! కేబినేట్ నోట్ - విషయ పరిజ్ఞానం లేని అజ్ఞానుల తొందరపాటు చర్య కాదు. ఒక కుట్ర బుద్ధితోనే - నిజాలను వక్రీకరించి, వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ఉల్టా పల్టా చేసారు! ఒక కథనం ప్రకారం 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జైపాల్ రెడ్డే - కేబినేట్ నోట్ - సృష్టికర్త అని చెబుతున్నారు.
మరి రాజకీయ కురువృద్ధుడు జైపాల్ రెడ్డి ఇట్లా ఎందుకు రాశాడు? రాజకీయ పండితుడైన ఆయన 29వ రాష్ట్రంగా - అంటే కొత్త రాష్ట్రంగా - తెలంగాణా ఏర్పడుతుందని ఎట్లా అన్నాడు? అది అవాస్తవం కదా! విడగొట్టబడే ప్రాంతాలే 'కొనసాగే రాష్ట్రం (Residual State) అని పేర్కోవడం 'వాస్తవ విరుద్ధం' కదా? తెలంగాణానే కొనసాగే రాష్ట్రమని ఎందుకు పేర్కోలేదు? సీమంధ్ర కొత్తగా ఏర్పడే 29వ రాష్ట్రమని ఎందుకు చెప్పలేదు? ఇందులో ఏమి మాయ, ఏం మతలబు ఉంది? ఇది న్యాయస్థానాలలో సవాలు చేయబడుతుండా? రాజ్యాంగం ఏమి చెబుతోంది?
పై ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే వెంటనే చెప్పండి. తెలిసి కూడా చెప్పకపోతే, మీ తల వేయి చెక్కలవుతుంది! సరైన సమాధానం తెలవకుండా ఏదో ఒకటి చెబితే - చదివే వాళ్ళ విమర్శలకు మీదే బాధ్యత!
( 'రాష్ట్ర విభజన' అంటూ జరిగితే ... అనే ఊహతో పై చర్చ చేశాను. అయితే, 'రాష్ట్ర విభజన' ఎట్టి పరిస్థితులలోనూ జరగదని నా ప్రగాఢ విశ్వాసం!)
No comments:
Post a Comment