Menu bar





Sunday, November 3, 2013

2/3 వ వంతు ఆధిక్యంతో కూడా పార్లమెంటు రాష్ట్రాన్ని విభజించ లేదు!



పరిపాలనకు సంబంధించినంత వరకు పార్లమెంటు సుప్రీం అంటారు. కానీ అంత లావు పార్లమెంటు కూడా రాజ్యాంగానికి అధిపతి కాదు! రాజ్యాంగమే సర్వోన్నతం! రాజ్యాంగ స్వభావాన్ని పార్లమెంటు మార్చ లేదు! పార్లమెంటులో 2/3 వ వంతు ఆధిక్యం ఉన్నప్పటికీ - రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చ లేదు! అనేక సందర్భాలలో సుప్రీం కోర్టు రాజ్యాంగానికి భాష్యం చెబుతూ - పార్లమెంటు అధికారాలకు ఉన్న హద్దులను గుర్తు చేసింది. హద్దు మీరడాన్ని నిలువరించింది. 

రాష్ట్ర విభజనకు పార్లమెంటుకు సంపూర్ణ అధికారం లేదు; ఉన్న అధికారం వివిధ పరిమితులతో, నిర్ణయాత్మకమైన షరతులతో ఉంది. 1. రాష్ట్రపతికి ఇందులో స్వతంత్ర ప్రమేయం ఉంది; 2. రాష్ట్ర అసెంబ్లీకి ఇందులో రాజ్యాంగబద్ధ పాత్ర ఉంది. 3. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి - 371-డి రూపంలో ఉన్న్నరాజ్యాంగ ప్రతిపత్తికి సమాధానం చెప్పవలసిన ఆగత్యం ఉంది.
రాష్ట్రపతికి స్వతంత్ర ప్రతిపత్తి:
రాష్ట్రపతి ప్రభుత్వం మాట ప్రకారమే నడుచు కోవాలి. నిజమే! కానీ - రాష్ట్ర విభజనకు సంబంధించి మాత్రం - రాష్ట్రపతికి స్వతంత్ర ప్రతిపత్తి ప్రత్యేకంగా లభిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు మధ్య రాష్ట్రపతి ఒక ధర్మ మూర్తిగా వ్యవహరించాలన్నది రాజ్యాంగ అభిలాష. ఈ సందర్భంలో రాష్ట్రపతి పీఠం 'విక్రమార్కుడి సింహాసనం' వంటిదే కావాలి. అకడ ఎవ్వరు ఉన్నా రాజ్యాంగ స్ఫూర్తిని పదిలంగా నిలుపుతూ, ధర్మ రక్షకులుగా వ్యవహరించాల్సిందే! అక్కడ ఉన్న ధర్మ సూత్రం ఏమిటి? 

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశం - పూర్తిగా రాష్ట్ర ప్రజల బాగోగులకు సంబంధించిన విషయం. అదే సమయంలో - రాష్ట్ర నైసర్గిక భౌగోళిక రాజకీయ స్వరూపంలో మార్పులు యావత్తు దేశానికి కూడా సంబంధించిన అంశాలే! ఒక రాష్ట్రంలో వచ్చే మార్పులతో - సరిహద్దు రాష్ట్రాలకు లేదా సమాన అంశాలలో వివాదాలు ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా సంబంధం ఉంటుంది. వాళ్ళకీ చెప్పుకునే, సంప్రదించే, మార్పు కోరే హక్కు ఉంటుంది. అట్లాగే - ఒక రాష్ట్రం దేశం నుంచి విడిపోతానని ఏకగ్రీవ తీర్మానం చేసినంత మాత్రాన - విడిపోయే హక్కు ఏకపక్షంగా లభిస్తే, అది దేశ సమగ్రతకే భంగకరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో - సంబంధిత రాష్ట్ర శాసన సభ, విధాన సభలకు అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఇచ్చారు. కానీ, నిర్ణయం తీసుకునే హక్కు ఇవ్వ లేదు! ఆ అభిప్రాయం పరిశీలించి రాష్ట్రపతి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఇదీ అసలు వాస్తవం! 

కాగా, మన విభజన వాదులు - ఈ 'జాతీయ ప్రాతిపదికను' - ఈ 'రాజ్యాంగ మౌలిక దృక్పధాన్ని' అసలు ప్రస్తావనకే తేకుండా, 'రాష్ట్ర అసెంబ్లీ' అభిప్రాయం తీసుకోవడం - 'కేవలం ఆనవాయతీనే', 'కట్టుబడవలసిన ఆగత్యం లేదు' - 'అభిప్రాయం తీసుకోవచ్చు - తీసుకోక పోవచ్చు', 'మెజారిటీ అభిప్రాయం చెల్లదు', 'విభజన మైనారిటీల హక్కు' - వగైరా వక్రీకరణలు, అభూత కల్పనలు చేస్తున్నారు. రాజకీయ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి - రాజ్యాంగ నిబద్ధతలన్నీ గాలికి కొట్టుకు పోతాయి - అని బూకరిస్తున్నారు. (రాజ్యాంగ ప్రతిష్ట విషయంలో - న్యాయ స్థానాలు ఇందిరాగాంధీ అహంకారాన్నే మట్టి కరపించాయి. సోనియా మంకుపట్టుకూ తగిన సమాధానం తప్పక చెబుతాయి). 

రాష్ట్ర శాసన సభ, విధాన సభల సభ్యులు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు. ఆ సభలు రాజ్యాంగబద్ధ సంస్థలు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వేళ - ప్రభావిత ప్రాంతాల ప్రజల అభిప్రాయానుసారం నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగమే సూచించింది. అభిప్రాయం తీసుకోవడం ఎందుకు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయ్యడానికా? కాలక్షేపానికా? నాటకీయత కోసమా? తమాషా చూద్దామనా? 'అభిప్రాయ సేకరణ' అన్న రాజ్యాంగ ప్రస్తావన ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక సంప్రదాయం కావాలన్నదే రాజ్యాంగ ఆకాంక్ష! ఈ ప్రజాభిప్రాయాన్ని నాటి దేశ, కాల, మాన పరిస్థితులనుబట్టి, సమస్య తలెత్తిన సందర్భం బట్టి, రాజ్యాంగ మౌలిక సూత్రాల ఆదేశాన్ని అనుసరించి - ధర్మ నిర్ణయం చేసే అధికారం - రాష్ట్రపతికి లభించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విషయంలో - రాష్ట్రపతి పాత్ర కేవలం 'రబ్బర్ స్టాంప్' వంటిది కాదు! తన విచక్షణను, విజ్ఞతను వ్యక్తం చేయవలసిన బాధ్యత రాష్ట్రపతిపై ఉంది. ఆ అధికారం ఆయనకు ఉంది.

విభజనకు ప్రాతిపదిక ఏమిటి?
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకోవడానికి ప్రాతిపదిక ఏమిటి? ప్రస్ఫుటమైన, స్పష్టమైన, బలమైన రాజకీయ నిర్ణయం అందుకు అవసరం. మరి, రాజకీయ నిర్ణయం అంటే ఏమిటి? సోనియా గాంధీ ఇష్టాయిష్టాలేనా? అట్లాంటి దిక్కుమాలిన నిర్వచనం ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఉండదు; ఉండకూడదు! కేంద్రంలో అధికార పార్టీ రాజకీయ అనివార్యతలు, లేదా ప్రభుత్వ అధినేత వ్యక్తిగత అవసరాలు దానికి ప్రాతిపదిక కాకూడదు. ఆసెంబ్లీ తీర్మానమే దానికి ప్రాతిపదిక కావాలి! ఆంటే రాజ్యాంగబద్ధంగా వ్యక్తీకరించ బడిన ప్రజాభిప్రాయమే దానికి ప్రాతిపదిక కావాలి! 

అట్లాంటి ప్రజాస్వామిక రాజకీయ నిర్ణయం లేకుండానే, ప్రైవేటు పార్టీల ఆత్మీయ లేఖలు, ప్రేమలేఖలు, బలవంతపు లేఖలు, దాగుడుమూతల లేఖలను - రాజకీయ నిర్ణయంగా ఎట్లా తీసుకుంటారు? అట్లా చెల్లుతుందని రాజ్యాంగంలో ఉందా? మెజారిటీ పార్టీలు - ఆ పార్టీల అధినేతలు కుమ్మక్కై - దేశాన్ని అమ్మేసే నిర్ణయం చేసినా చెల్లుబాటు అవుతుందా? ప్రజల ప్రమేయం లేని ప్రజాస్వామ్యం ఒక ప్రజాస్వామ్యమేనా? ఈ విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర శాసన, విధాన సభల తీర్మానం కోరాల్సిందే! అదే ప్రజాస్వామిక రాజకీయ నిర్ణయం అవుతుంది.

మన విభజన వాదులు ఇక్కడ 'మైనారిటీ ప్రతిపత్తి' మాట తెస్తున్నారు. విడిపోవాలని కోరుకునే ప్రజలు - ఎప్పుడూ - మైనారిటీలోనే ఉంటారు కనుక, అసెంబ్లీలో మా మాట ఎప్పటికీ నెగ్గదు కాబట్టే - ఆర్టికల్ -3 మాలాంటి వాళ్ళ కోసమే - అసెంబ్లీ ఉత్తుత్తి అభిప్రాయం చాలు - అనే ఏర్పాటు చేసింది. అంబేద్కర్ మహాశయుడు చాలా ముందు చూపుతో ఈ ఏర్పాటు చేసాడు, అని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ మాటలకు హేతుబద్ధత ఎంత ఉందో చూద్దాం! 

>> విడిపోతాము - అని చెప్పేవాళ్ళు ఎప్పుడూ మైనారిటీలోనే ఉంటారని - రాసిపెట్టి లేదు! మహారాష్ట్రలో, యూపీలో విడిపోవడానికి మెజారిటీ తీర్మానమే ఉంది. అయినా దానిని పరిగణనలోకి తీసుకోలేదు! ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్ విభజన డిమాండు మైనారిటీ డిమాండే! అయినా, అసెంబ్లీ తీర్మానమే ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాల పునర్విభజన సాధ్యమయ్యింది. రాజకీయ నిర్ణయమంటే - నిరంకుశ నిర్ణయం మాత్రం ఎప్పటికీ కాబోదు!

>> తెలంగాణా విషయంలో కూడా - అట్లాంటి ప్రజాస్వామిక రాజకీయ నిర్ణయం - సాధ్యపడేదే! కానీ, విభజన వాదులు చేసిన విద్వేష ప్రచారం, ఒక శత్రు సమాజంతో యుద్ధం చేస్తున్నామన్న విషమ వాతావరణం సృష్టించడం, జన సామాన్యం అభిప్రాయాలకు భిన్నంగా గొంతెమ్మ కోర్కెలు కోరడం - అందులో దాగిన వివక్షత, హింసాత్మక ప్రవృత్తి - ఇవన్నీ విభజన డిమాండు - తెలంగాణా సామాన్య ప్రజల చిరకాలపు ఆకాంక్ష - అన్నట్లుగా కాకుండా, ఒక కుట్ర పూరితమైన రాజకీయ స్వార్థపరుల హింసాత్మక దాడిగా ఒక భయానక రూపం ముందుకు వచ్చింది. జాతీయ రాజకీయాలలో నేడు ఉన్న సందిగ్ధ పరిస్థితినుంచి, సంక్షోభాన్నుంచి గట్టెక్కడానికి ఒకరు, ఆ బలహీనతనే సొమ్ము చేసుకొందామని మరొకరు - పోటీబడి - ప్రజాస్వామిక సంప్రదాయాలను, రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కి - రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని ప్రయత్ని స్తున్నందు వల్లనే - రాష్ట్ర విభజనకు ప్రజల మద్దతు లోపించింది!


>> మైనారిటీ అభిప్రాయానికి రాజ్యాంగం ఆర్టికల్ 3 గుర్తింపు ఇస్తోందని ప్రచారం చేస్తున్న విభజన వాదులు - పార్లమెంటులో కూడా - మైనారిటీ వాదనే చెల్లుతుందని - రాజ్యాంగం ఎందుకు చెప్పడం లేదో వివరించాలి. మైనారిటీ అభిప్రాయంలో ఔచిత్యాన్ని - తోటి ప్రజలకే నచ్చ చెప్పలేని వాళ్ళు - దేశ ప్రజలకు ఎట్లా నచ్చ చెప్పగలరో స్పష్టం చెయ్యాలి. ప్రజలకు నచ్చ చెప్పటం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఇవేవీ వాళ్లకు అక్కర లేదు; సోనియా కరుణాకటాక్షాలే చాలన్నమాట! అధికార మదంతో రాజ్యాంగ విధివిధానాలను పాటించనప్పుడు ధర్మ పీఠం తలుపులు తట్టే అవకాశం ఎట్లాగూ ఉంది.
రాజ్యాంగ అతిక్రమణ అసాధ్యం!

అసెంబ్లీ తీర్మానం బిల్లు పంపించవలసిందే! ఉభయ సభలు వ్యక్తీకరించిన అభిప్రాయంపై రాష్ట్రపతి ధర్మ నిర్ణయం చేయవలసిందే! పార్లమెంటులో బిల్లు చర్చకు రావలసిందే! బిల్లులో ఉన్న ప్రస్తావనలను బట్టి దానికి తార్కిక ముగింపు ఏమిటో నిర్ణయం కావలసిందే!

అయితే, ఈ ప్రక్రియకు మధ్యలోనే - న్యాయపరమైన చిక్కులు తప్పవు! ఆర్టికల్ 371-డి అస్తిత్వం విసురుతున్న సవాళ్ళకు సమాధానం చెప్పకుండా విభజన ప్రక్రియ ముందుకు సాగదు. నదీ జలాల వివాదాలకు పరిష్కారం చెప్పకుండా - ఆమేరకు - వివిధ రాష్ట్రాలలమధ్య సమన్వయం సాధించకుండా - విభజన కుదరదు! ముందుగానే, 371-డి విషయంలో ఏమి చేస్తారో, పారదర్శకంగా ఎట్లా వ్యవహరిస్తారో, దానిలోని న్యాయపరమైన వివాదాలకు ఎట్లా పరిష్కారం చెబుతారో, అందులోని రాజ్యాంగ పరమైన చిక్కుముళ్ళను ఎట్లా విప్పుతారో స్పష్టం చెయ్యక తప్పదు!

371-డి రాష్ట్ర ప్రమేయం కోరుతుంది:

371-డి మన రాష్ట్రం తీర్మానం మీద ఏర్పడిన ప్రత్యేక అధికరణం. రాష్ట్రాల స్థానిక అవసరాలకు, అస్తిత్వ పరమైన సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కుల కారణంగానే - 371- డి వెలుగు లోకి వచ్చింది. 1969-72 ఉద్యమాల నేపథ్యంలో మనం రూపొందించుకున్న 6 సూత్రాల పథకంలో భాగంగా జోనల్ రిజర్వేషన్లు ఏర్పరుచుకున్నాం. వాస్తవానికి అవి అప్పటికే అమలులో ఉన్న భారత రాజ్యాంగ నియమాలకు విరుద్ధం. కేంద్ర - రాష్ట్ర సంబంధాలకు విరుద్ధం. అప్పుడు తలెత్తిన రాజ్యాంగ ప్రశ్నకు పరిష్కారంగా 371 అధికరణం కింద - 7వ షెడ్యూలులో భాగంగా - ఒక సమన్వయ నిర్ణయంగా - 371-డి, ఇ అధికరణాలు ప్రవేశ పెట్టవలసి వచ్చింది. అందుకు మన రాష్ట్రం యొక్క రాజకీయ నిర్ణయాన్ని - ఎకగ్రీవ తీర్మానం ద్వారా - కేంద్రానికి తెలియ చేశాం. వివిధ రాష్ట్రాలలో సగ భాగం ఆమోదం కూడా తీసుకొని, పార్లమెంటులో 2/3వ వంతు ఆధిక్యతతో - 371-డి, ఇ అధికరణాలు రూపొందాయి.
రాష్ట్ర ప్రజల అభిప్రాయం అవసరం:

ఇప్పుడు 371-డి, ఈ లలో మార్పులు, చేర్పులు చెయ్యాలనుకుంటే, నేటి పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో కూడా ఆ పని చెయ్య లేదు; 50% రాష్ట్రాలు ఒప్పుకున్నా కూడా ఆ అధికరణాలు రద్దు కావు! ఆ అధికరణంలో మార్పులు, చేర్పుల కొరకు మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీకి - పంపించ వలసిందే! అంటే, ఇక్కడి ప్రజల సర్వ సమ్మతితోనే - వాటి రద్దు కానీ, సవరణ గానీ సాధ్యమవుతుంది. 

371-డి సర్వ సామాన్యమైన అధికరణం కాదు. అది కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగ అధికరణం. దానికి ఉన్న చారిత్రిక నేపథ్యం, గత నాలుగు దశాబ్దాలుగా అదే అధికరణం కింద తమ జీవితాలను మలచుకున్న కోట్లాది ప్రజల ఆకాంక్షలు - 371-డి ని అభేద్యమైన కంచుకోటగా మలిచాయి. సర్వసామాన్య ప్రాజానీకమంతా ముక్త కంఠంతో 'తెరుచుకో ససేమ్' అంటే తప్ప - ఆ అధికరణాలను అంటుకోవడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు!

రాష్ట్ర విభజన అనే ఒక అసంబద్ధ, అప్రజాస్వామిక వాదం - రాజకీయ అవకాశవాదంతో జత కలిపి , దూకుడుగా ముందుకు దూసుకుబోతున్న పరిస్థితిని 371-డి ఖచ్చితంగా అడ్డు కొంటుంది. రాహల్-మోడీ కూడబలుక్కొని ఈ ప్రజాస్వామిక అత్యాచారానికి పూనుకోవడాన్ని నిరోధించడానికి 371-డి బ్రహ్మాస్త్రం గానే పని చేస్తుంది. నమో - రాగాలు ఉభయులూ కలిసి రాజ్యాంగా ధిక్కారం చేస్తే జనం సహించి ఊరుకోరు!

రాజ్యాంగ నిబద్ధతలన్నీ కాలరాచి నిరంకుశంగా వ్యవరించడానికి అధినేత్రి, ఆమె వందిమాగధులు పూనుకుంటే, బీజేపీ అధినేత కూడా విచక్షణ మరచి, అట్టి రాజ్యాంగ ధిక్కారానికి అనుమతి ఇస్తే, అంతా కలసి, అడ్డగోలుగా రాజ్యాంగ సవరణకు బరితెగిస్తే - దొంగ దెబ్బ తీయడం సాధ్యమవుతుందేమో కానీ, న్యాయపూర్నంగా రాష్ట్ర విభజన కుదరదు. సర్వ సాధారణ ప్రజాస్వామిక, న్యాయ సూత్రాలకు, ధర్మబద్ధతకు ఏ మాత్రం గౌరవం ఇచ్చినా - రాష్ట్ర విభజన అసంబద్ధం, రాజ్యంగా విరుద్దం, అనైతికం అని గ్రహిస్తారు! ఇక్కడి ప్రజల సర్వ సమతి లేకుండా రాష్ట్ర విభజన జరగదు! కాదని, ధర్మాన్ని తోసిరాజనీ చేసేది విపక్ష, ప్రతిపక్షాలు కలిసి చేయగలిగింది సామూహిక అత్యాచారం మాత్రమే!

No comments:

Post a Comment