Menu bar





Saturday, November 2, 2013

అడ్డదారులు మానండి! జనాభిప్రాయం తీసుకోండి!

కేంద్ర మళ్ళీ అఖిల పక్షం ఆట మొదలు పెట్టింది. ఇది పచ్చి రాజకీయ క్రీడ! cwc నిర్ణయం ముందే అఖిల పక్షం నిర్వహించి ఉంటే ... అది రాజకీయ ప్రక్రియలో ఒక భాగంగా నప్పేది. విభజన లాభం అంతా సొంతంగా పొందాలన్న స్వార్థంతో - ఆ రాజకీయ ప్రక్రియను అర్థాంతరంగా ముగించింది. తర్వాత - అరాచక పద్ధతిలో విభజన కాండ - కొనసాగించింది.
విభజన అడ్డగోలుగా జరుగుతోందని లోకం అంతా కోడై కోసిన తర్వాతే, విభజన రాజ్యాంగ ప్రక్రియకు భిన్నంగా నడిపిస్తున్నారన్న విమర్శకు లోనైనా తర్వాతే, విభజన తతంగంలో పారదర్శకత, ప్రజాస్వామ్య స్ఫూర్తి నశించాయని జనం గగ్గోలు పెట్టిన తర్వాతే, కేంద్రం ఇప్పుడీ 'అఖిల పక్ష నాటకానికి' తెర తీసింది! కానీ, ఈ 'అఖిల పక్షం మంత్రం' పని చెయ్యదు! జరగదు! అట్లాంటి చొరవకు కాలదోషం పట్టించింది కాంగ్రెస్సే!

అఖిల పక్షం ఒక మోస పూరిత ఎత్తుగడ! అది విభజన సమస్య మీద అఖిల పక్షం కాదు! అది విభజన ఎట్లా జరగాలన్న విషయంపై అఖిల పక్షం! సీమ, తీర వాసులను బలవంతంగా ఎట్లా తన్ని తరిమెయ్యాలో చెప్పటం కోసం ఏర్పాటు చేస్తున్న కుటిల పన్నాగం! అది అయ్యే పని కాదని కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు! అయినా జనాన్ని మభ్యపెట్టడానికే ఈ కొత్త రాగం అందుకొంది! నిజానికి ఇపుడు నిర్వహించవలసింది అఖిల పక్షం కాదు; అఖిల ప్రజానీకం మనసు తెలుసుకునే 'జన పక్షం'! ఈ అఖిల పక్ష డ్రామాలను జనం అంగీకరించరు.

పార్టీలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వైకాపా ఇప్పటికే జెల్ల ఇచ్చింది; తెదేపా ఛీ కొట్టింది; లోక్ సత్తా జీవోయం బాయ్ కాట్ చేసింది కాబట్టి జీవోయంకు కొనసాగింపైన ఈ అఖిల పక్షాన్నీ పో పొమ్మనే అంటుంది! అదే కారణంగా సీపీఎం, ఎమ్మైఎమ్ కూడా గైరాజరవుతాయి. ఇక తెరాసా, బీజేపీ , కాంగ్రెస్ కూచ్చొని ఏమి చేస్తాయి? కాబట్టి ప్రకటనతోనే ముగిసిపోయే అఖిల పక్షమే ఇది. మరో వారం కాలక్షేపం!

అయినా, కేంద్రానికి ఈ అడ్డ దారులు ఎందుకు - రాజ మార్గం ఉండగా! రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచి 'రాష్ట్ర విభజన' పై కూలంకషంగా చర్చించండి. మీరే చెబుతున్నారు కదా, అసెంబ్లీ అభిప్రాయం బైండింగ్ కాదని! మరి భయమేల?! రండి ప్రజా దర్బారుకి!! మోమాటం లేకుండా స్పష్టంగా మాట్లాడుకుందాం-

No comments:

Post a Comment