రాష్ట్రవిభజనను వచ్చే సాధారణ ఎన్నికల వరకు వాయిదా వేయించగలిగితే, ఇక విభజన ప్రక్రియ ఆగిపోతుందని సమైక్యవాదుల ధృడంగా నమ్ముతున్నారు. అందుకు బలమయిన కారణాలు లేకపోలేదు.
ఎందుకంటే ఈసారి యుపీయే, ఎన్డీయే రెండు కూటమిల మధ్య చాలా గట్టి పోటీ ఉంటుంది, గనుక వీటిలో ఏ ఒక్కటి కూడా పూర్తి మెజార్టీ సాధించి తమంతట తాముగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అంతే గాక నితీష్ కుమార్, ములాయం సింగ్ వంటి వారు మూడో ఫ్రంట్ ఏర్పాటు గురించి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ అదికూడా అవతరిస్తే అప్పుడు ఈ మూడు కూటమిల మధ్య ఓట్లు చీలిపోవచ్చును. థర్డ్ ఫ్రంట్ అవతరించక పోయినప్పటికీ, యుపీయే, ఎన్డీయే కూటమిల మధ్య ఓట్లు చీలడం ఖాయం గనుక ఎవరికీ పూర్తి ఆధిఖ్యత రాకపోవచ్చును.
అప్పుడు రెండు కూటములకి దేశంలో ప్రతీ ఒక్క యంపీ మద్దతు కీలకంగానే మారుతుంది. అటువంటప్పుడు ఏకంగా 25మంది సీమాంధ్ర యంపీల మద్దతు చాలా కీలకంగా మారబోతోంది. అయితే వారిలో వివిద పార్టీలకు చెందిన వారుంటారు గనుక రెండు కూటములకి వారి మద్దతు పొందే అవకాశం సరి సమానంగా ఉంటుంది. అంటే కేంద్రంలో ఒకవేళ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినా, రాష్ట్రం సమైక్యంగా ఉంచదానికి అంగీకరిస్తే వారిలో కనీసం 15-20 మంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అందుకు ప్రతిగా ఎన్డీయేకి తెలంగాణాలో తెరాస మద్దతు లభ్యం అవదు. అయితే ఈ సారి తెరాస నుండి కేవలం 5-8 మంది యంపీలుగా గెలిచే అవకాశమున్నట్లు సర్వేలు చెపుతున్నాయి గనుక, ఎన్డీయే కూటమి 15-20 మంది యంపీలున్న సీమాంధ్ర వైపే మొగ్గు చూపవచ్చును.
ఒకవేళ యూపీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ, కేంద్రంలో ఐదేళ్ళపాటు అధికారంలో కొనసాగాలంటే సీమాంధ్ర యంపీలపై ఆధారపడక తప్పదు. బహుశః అందువలననే రాష్ట్ర విభజనను ఎన్నికలు వరకు నిలువరించగలిగితే, విభజన ప్రక్రియ ఆగిపోతుందని సమైక్యవాదులు దృడంగా భావిస్తున్నారు.
అయితే ఈ రెండు కూటములలో ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయం గనుక, అవి కేంద్రంలో మళ్ళీ కుదురుకొనే వరకు రాష్ట్ర విభజనలో కొంత జాప్యం ఉండవచ్చు తప్ప పూర్తిగా నిలిచిపోయే అవకాశం లేదు.
No comments:
Post a Comment