Menu bar





Friday, November 8, 2013

'విభజన'కు తెలుగేతర శక్తులు కుట్రపన్నుతున్న వేళ ...



               దేశ స్వాతంత్ర్యానంతరం భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ముందు ఆంధ్రరాష్ట్రంగా, ఆ పిమ్మట తెలుగుప్రజలు నివసిస్తున్న ప్రాంతాలను కలుపుకుని మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి పురోభివృద్ధి చెందుతున్న తెలుగుజాతిని బలవంతంగా విడగొట్టే ప్రయత్నంలో చరిత్రలో మొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ లోని, దాని కేంద్రప్రభుత్వంలోని తెలుగేతర శక్తులన్నీ ఏకమవుతున్న వేళ జాతి యావత్తు - మూడుప్రాంతాలలోని తెలుగుప్రజలూ ముప్పేటగా ప్రతిఘటించవలసిన తరుణం ఎప్పటికన్న కూడా ఇప్పుడు వచ్చింది; తెలుగుజాతి ఉనికిని భంగపరిచే కుట్రకు తెలుగేతరులతో చేతులు కలిపిన స్వార్థపరులూ, విద్రోహులూ తెలుగువారి మధ్యనే ఉండటం ఏమాత్రం సహించరాని పరిణామం. "ఇంటిదొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడ''న్న సామెత వచ్చింది! ఈ ఇంటిదొంగల విద్రోహాన్ని కనిపెట్టిన తెలుగేతర శక్తులు ఆ దొంగల్ని వినియోగించుకుని "2009 డిసెంబర్ 9''న ఢిల్లీనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజం నాటేందుకు ముందుకొచ్చారు. ఈ "విభజన'' ప్రాతిపాదనకు కారకులైన స్థానిక విద్రోహులు ముగ్గురూ పచ్చి పదవీ కాంక్షాపరులూ, స్వార్థపరులూ, రాజకీయ నిరుద్యోగంతో "లంఖణాలు'' పడుతూ వచ్చిన సీమాంధ్రులే కావటం మరీ దారుణమైన పరిణామం. ఈ ముగ్గురూ జాతి చరిత్ర, దేశచరిత్రా తెలియని మూర్ఖులే.

            వీరిలో ఒకరు ఒక స్థానిక పార్టీకి అధ్యక్షుడూ, మాజీ ముఖ్యమంత్రీకాగా, మరొకరు మరో స్థానిక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ఒక మాజీమంత్రి, పచ్చి అవకాశవాదే గాకుండా ఒక ప్రాంతానికి ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవికి 'ఏతాం' ఎత్తిన 'దొర', ఇంకో నాయకుడు లాడ్జింగ్ ల వ్యాపారంలో రకరకాల వ్యాపకాల కోసం లాడ్జింగ్ ల నిర్వహణలో కాకలు తీరడం ద్వారా రాజకీయాల్లోకి దూసుకువచ్చిన మహానుభావుడు, ఒక స్థానిక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడూ! వీరిలో ఒకరు తెలంగాణాకు వలసవచ్చి స్థానిక ప్రజల్ని దోపిడీ చేయడంలో మొనగాడుగా మారి, ఆ సంపదను రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ప్రజల్ని ముఖ్యంగా దళితవర్గాల ప్రజలను నానాయాతనలు పెట్టడానికి 'ఉద్యమిం'చినవాడు; ఆ పదవీ స్వలాభం కోసం తోటి తెలుగు యువకులను, నిరుద్యోగ యువతను పచ్చిఅబద్ధాలతో తెలుగుజాతికే వ్యతిరేకంగా అనేక ప్రలోభాలతో ఉద్రేకపరిచి, బలవంతాన వందలాది మందిని ఆత్మహత్యల వైపు ప్రోత్సహించిన వాడు; ఆ క్రమంలో ఆ నేరం ఫలితంగా తనకు శిక్షలు పడకుండా తప్పించుకో జూస్తున్నాడు! ఈ ముగ్గురూ ఎవరో ఈసరికే అర్థమైపోయి ఉండాలి.

          ఈ ముగ్గురు తెలుగు "మరాఠీ''ల వ్యవహారసరళి గమనించిన తరువాత సోనియాసహా కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలో కూడా "విదూషకులు'' తలెత్తారు. జాతి విభజన ప్రతిపాదనకు ముందు కాంగ్రెస్ అధిష్ఠానంలోని కేంద్రమంత్రి మండలిలోని తెలుగేతర శక్తులు చేసిన పని తెలుగుకు ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి దక్కకుండా కుట్రపన్నటం! ఈ బాపతులో ముఖ్యమైన చొరవచూపిన వాళ్ళు - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలోని డి.ఎం.కె.ముఠా భారతీయ భాషల్లో అత్యంత శక్తిమంతమైన ద్రావిడభాషా కుటుంబంలో అజంత భాషగానూ, యావత్తు ప్రాచ్యఖండపు భాషలలోనే "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'' (ప్రాచ్యాఖండపు ఇటలీభాష)గానూ నికోలమ్ కోంటీ కీర్తించిన తెలుగుభాషను తొక్కిపెట్టడానికి ప్రయత్నించడమేగాక, ప్రాచీన చరిత్రగల సంస్కృత భాషను కూడా పక్కనపెట్టి ముందుగా తమిళభాషకు శిష్ట భాష ప్రతిపత్తిని అధికారికంగా కుట్రద్వారా ప్రకటింపజేసుకున్నవారు కొందరు తమిళ మంత్రులు! ఆ తరువాతనే సంస్కృతానికి, తెలుగు, కన్నడ భాషలకు కూడా ప్రజాద్యోమాల ద్వారానే కేంద్రం శిష్టభాషా ప్రతిపత్తిని ప్రకటించకతప్పలేదు! ద్రావిడ భాషా కుటుంబంలో స్వతంత్రప్రతిపత్తితో మొట్టమొదటిసారిగా విడివడి తన తనాన్ని ఘనంగా చాటుకున్న భాష తెలుగేనని మరచిపోరాదు!

          అలా కేంద్రమంత్రి వర్గంలోని 'తమిళలాబీ'వర్గం ముందు తెలుగుభాషకు చిచ్చుపెట్టడానికి కాల్డువ్వి విఫలమైన తరువాత తెలుగుజాతిని చీల్చడానికి కూడా సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నిరుద్యోగులైన 'గుప్పిడు' నాయకుల స్వార్థప్రయోజనాలను పసికట్టిన తమిళపెద్దలు ఆ నాయకుల పదవీలాలసను వాడుకున్నారు; దాని ఫలితంగా కేంద్రంలో తమిళమంత్రి చిదంబరం నోటినుంచి వెలువడిందే - తెలంగాణా విభజనకు ''ప్రక్రియ (ప్రోసెస్) మొదలవుతుందన్న ప్రకటన! ఇక అక్కడినుంచి ఇటీవల దాకా ఆ ప్రక్రియను ఎలా ప్రారంభించి, ఎలా ముగించాలో పాలుపోక కుడితిలో పడిన ఎలుక మాదిరిగా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వమూ, రాష్ట్రంలోని నేను పైన ప్రస్తావించిన ఆ ముగ్గురు 'విదూషక' రాజకీయవేత్తలూ తన్నుకు చావవలసి వచ్చింది! సరిగ్గా ఈ సమయంలోనే తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి ఒక ప్రకటనలో "తమిళనాడు రాష్ట్రంనుంచి మదురై రాజధానిగా దక్షిణ తమిళనాడు విడిపోవాలని సాగుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని గమనించకుండా ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన ప్రక్రియను ఎలా చేపట్టావ''ని చిదంబరాన్ని వాయించ వలసివచ్చిందని మరచిపోరాదు.

              అది మొదలు - ఈ రోజువరకూ పొత్తు, పొంతనా లేని ప్రకటనలతో, పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యాలతో మంత్రులూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని దిగ్విజయ్ సింగ్, షిండే, చాకో, వీరప్పమొయిలీ, గులామ్ నబీ ఆజాద్, సందీప్ దీక్షిత్ పోటాపోటీలతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనపైనే కేంద్రీకరిస్తూ వచ్చారు! భాషాప్రయుక్త ప్రాతిపదికపైన అందులోనూ దశాబ్దాలపాటు కాంగ్రెస్ తీర్మానాలకు అనుకూలంగానూ, అదే కాంగెస్ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగుజాతికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి అదే కాంగ్రెస్ చేజేతులా స్వార్థప్రయోజనాల కోసం చీల్చాలని తపన పడుతోంది. అందుకు దారి కనపడకనే పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో ప్రజల్ని గందరగోళ పరుస్తూ 'మానవద్వేషు'లు (శాడిస్టుల)లాగా వీరు తెలుగుజాతిని వారి మధ్య నెలకొన్న భవబంధాలనూ బలవంతంగా తెగ్గొట్టడానికి స్థానిక 'విదూషకు'లను తోలుబొమ్మలుగా కాంగ్రెస్ అధిష్ఠానం వాడుకొంటోంది. 'గురివింద గింజ' తన కింది 'నలుపు'ను ఎరుగనట్టే మహారాష్ట్రలో 'విదర్భ'ప్రాంతం, కర్ణాటకలోని 'కూర్గు', బెంగాల్ లోని 'గూర్ఖాలాండ్', తమిళనాడులోని దక్షిణ తమిళనాడులాంటి ప్రాంతాలు కోరుతున్న వేర్పాటువాదులను ఉద్యమాలను పట్టించుకోకుండా 42 మంది ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల అండతో ఇంతకాలం ధైర్యంగా నిలబడుతూ వచ్చిన కాంగ్రెస్ కేంద్రప్రభుత్వం అకస్మాత్తుగా ఒక్క తెలుగుజాతి ఐకమత్యాన్నే ధ్వంసం చేయడానికి కారణం - రాష్ట్రంలోని గుప్పిడు విద్రోహుల ఉద్యమంతో పాటు ఎన్నికల అనంతరం కేంద్రంలో రకరకాల పదవులకోసం అర్రులుచాస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల తపన తప్ప మరొకటి కాదు.

          షిండే విదర్భ గురించి మాట్లాడడు, మొయిలీ కూర్గును గురించి ప్రస్తావించడు, గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి గురించి కేంద్రంలోని బెంగాల్ మంత్రులూ మాట్లాడరు. కాని వీరందరికీ ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగుజాతి అన్నా కన్నెర్ర చేయడానికి సాహసిస్తారు. ఈ దుస్సాహసాన్ని తెలుగుజాతి తిప్పికొట్టడానికి సిద్ధమవుతారు. స్థానిక "బుడ్దర్ ఖాన్''ల, జాతి విద్రోహుల భరతాన్ని ప్రజలు పడతారు! ఆరునెలల స్నేహంలో "వారు వీరు, వీరు వారు అవుతార''న్న  సామెతకు తోడుగానే సుమారు 150 సంవత్సరాలపాటు దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన ఫలితంగా వారి "విభజించి - పాలించే'' విధానాన్ని నేటి కాంగ్రెస్ నాయకత్వం అప్పనంగా "దత్త స్వీకార పధ్ధతి'' నమూనాలోనే అందిపుచ్చుకున్నది! అందుకు రాజ్యాంగంలో, స్వదేశ సంస్థానాలు భారత యూనియన్ లో చేరడానికి 'ససేమిరా' అంటూ, ఎవడికివాడు సొంత "రాజ్యాలు'' కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న ఘడియలలో ఆ పరిణామాన్ని నివారించడం కోసం రాజ్యంగా నిర్ణేతలు అధికరణ (3)ను ప్రవేశపెట్టవలసి వచ్చింది; సరిగ్గా ఆ సమయంలోనే ముసాయిదా రాజ్యాంగానికి తుదిమెరుగులు దిద్దుతూ, ఉత్తరాత్టరా తమ "రాజ్యాల''లో [స్వదేశ సంస్థానాలు] స్వతంత్ర భారత పార్లమెంటును కాదని మొరాయించే పక్షంలో ఆ సంస్థానాలను విడగొట్టి వాటి అసహజమైన సరిహద్దుల్ని చెరిపి, ఆ సంస్థానాలను మరొక దానితో విలీనం చేసే స్వేచ్చను పార్లమెంటుకు దఖలు ఏర్పర్చడమే ఆ అధికరణ లక్ష్యం!

               కాని ఆ అధికరణ చాటున దాగి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని - అదే అధికరణను తన "సీట్ల''ను కాపాడుకోవడం కోసం, తన అధికారాన్ని ఎలాగోలా నిలుపుకోడం కోసం, ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయడం, పచ్చిస్వార్థంతో ప్రజలను చీల్చడం కోసం ఆ అధికరణ (3)ను ఉపయోగించడానికి అలవాటుపడింది. అంతేగాని, రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కాదు. ప్రజల ప్రయోజనమే తన పరమావధి అనుకుంటే, రాజ్యాంగం అయిదవ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ, గిరిజన తెగల ప్రయోజనాలను కాపాడడం కోసం వలస చట్టాల్ని చించివేసి వారికి స్వపరిపాలనా ఏర్పాట్లు చేయాలి. కాని ఆ పని 65 సంవత్సరాల తర్వాత కూడా జరగలేదు. అందుకే గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి కల్పించాలన్న డిమాండూ ముందుకు రావలసి వచ్చిందని గ్రహించాలి!

No comments:

Post a Comment