ఆంధ్రుల చరిత్రము : పోరు - నష్టము; పొందు - లాభము(వికీపీడియా నుండి)
చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రుల చరిత్రము ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో ఆంధ్ర క్షత్రియులు పాలించిన సామ్రాజ్యాలు, వారి అనంతరం వచ్చిన రెడ్డి రాజులు, కమ్మ, నిజాము నవాబులు గురించి, బ్రిటిషు వారి గురించి విపులంగా ఇవ్వబడింది.ప్రథమ భాగము:
ఈ భాగము 1910 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఈ భాగములో కల వివరములు.
"ఆంధ్రులయొక్క రెండువేలయేనూరుసంవత్సరముల చరిత్రమును సవిస్తరముగా వ్రాయ నుద్యమించినవాడను గావున నంతయు నేక సంపుటమున నిమిడ్చిన నంతమనోహరముగా నుండదనియు, ప్రథమగ్రంథమగుటం జేసి యట్లుచేయుట సులభసాధ్యముగాదనియు భావించి చరిత్రకాలమునంతయు బూర్వయుగము, మధ్యయుగము, నవీనయుగము నని మూడుభాగములుగా విభాగించి యైతరేయ బ్రాహ్మణము మొదలుకొని క్రీస్తుశకము 1200 సంవత్సరమువరకును బూర్వయుగముగా గ్రహించి యాపూర్వయుగచారిత్రమునే ప్రథమభాగముగా నేర్పరచుకొంటిని. ఇందు ప్రాచీనాంధ్రదేశస్థితియు, ఆంధ్రవంశము, పల్లవవంశము, చాళుక్యవంశము, చాళుక్యచోడవంశము, కళింగగాంగవంశము, ఆంధ్రచోడవంశము, బాణవంశము, వైదుంబవంశము, హైహయవంశము, బేటవిజయాదిత్యవంశము, కళింగగాంగవంశము, విష్ణుకుండిన వంశము మొదలగునవి సంగ్రహముగా నిందుజేర్పబడినవి."
ద్వితీయ భాగము
ఈ భాగము 1912 లో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ప్రచురించబడింది. ఇది మధ్యయుగమునకు సంబంధించిన చరిత్ర. క్రీ.శ1100 నుండి 1350 వరకు ప్రధానంగా కాకతీయ సామ్రాజ్య పతనము వరకు వ్రాయబడినది.
మూడవ భాగము
ఈ భాగము 1916 లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది. ఈ భాగములోని విషయం గురించి రచయిత మాటల్లో >> "ఈ మూడవభాగములో క్రీ.శ 1323 మొదలుకొని క్రీ.శ. 1500 వఱకు గల చరిత్రము సంగ్రహముగా జెప్పబడినది. కాకతీయసామ్రాజ్యము భగ్నమైన వెనుక భిన్నరాజ్యములేర్పడి వేఱ్వేఱు రాజవంశములచే బరిపాలింపబడుటచేత పద్మనాయకుల చరిత్రము వేఱుగను, రెడ్ల చరిత్రము వేఱుగను జెప్పవలసి వచ్చినది. పద్మనాయకుల చరిత్రమువలన నోరుగల్లు చరిత్రమును గూర్చి ఫెరిస్తా మొదలగు మహమ్మదీయ చరిత్రకారులును , వారినిబట్టి స్యూయలు మొదలగు వారును వ్రాసిన చరిత్రములు సరియైనవి కావని తేటపడగలదు. ఈ మూడవ భాగమును జదువునపుడు రాచవారును, పద్మనాయకులును, రెడ్లును పరస్పర ద్వేషముల మూలమున సామ్రాజ్యములను బోగొట్టుకొని పారతంత్ర్యమునకు వశులైరనియును, కర్ణాటాంధ్రుల యైకమత్యము వలన కర్ణాట సామ్రాజ్యమని వ్యవహరింపబడిన విజయనగర సామ్రాజ్యము వర్ధిల్లినదనియు జదువరులుకు బోధపడగలదు. పోరునష్టము పొందు లాభమను విషయమునే యీ మూడవభాగము వేనోళ్లజాటుచున్నది."

No comments:
Post a Comment