Menu bar





Tuesday, October 1, 2013

ఇస్తామంటున్న 29 వ రాష్ట్రం ఏది? సీమసర్కార్ ప్రాంతమా? తెలంగాణానా?

రాష్ట్ర విభజన చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అవకాశం కల్పిస్తోందని అంటున్నారు. ఆర్టికల్ 3లో నాలుగు పద్ధతులలో రాష్ట్ర విభజన చేయవచ్చు. కానీ అందులోని ఏ పద్ధతిలోనూ రాష్ట్ర విభజన సాధ్యం కాదని నా అభిప్రాయం:

ఆర్టికల్ 3 ఏమంటోంది?
1. రెండు లేదా అనేక రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చెయ్యవచ్చు.(3b ) - మన ముందున్నసమస్య ఇది కాదు.
2. వేర్వేరు రాష్ట్రాల భాగాలను చేర్చి సరి కొత్త రాష్ట్రం ఏర్పాటు చెయ్యవచ్చు.(3c) - ఇదీ కాదు.
3. ఒక రాష్ట్రంలోని కొంత భాగాన్ని వేరు చేసి, అప్పటికే ఉన్నమరో రాష్ట్రంలో కలిపి కొత్త రాష్ట్రంగా రూపొందించవచ్చు (3d) - ఇదీ కాదు.
4. ఒక రాష్ట్రంలోని ఒక భాగాన్ని వేరు చేసి కొత్త రాష్ట్రంగా ఏర్పరచవచ్చు. (3a) - ఇది సరిపోతుందా? చూద్దాం!

ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణాను వేరు చేయాలనే కదా ఉద్యమం నడుస్తోంది. ఈ 3a క్లాజ్ 'రాష్ట్ర విభజన' కు సరిపోతున్నట్లే ఉంది కదూ - కానీ ఇది కూడా అందుకు పనికి రాదు! ఎలాగో చూద్దాం:

3 a క్లాజు ప్రకారం ఒక ఉనికిలో ఉన్న రాష్ట్రం నుంచి కొంత భాగం చీల్చి ఇంకో రాష్ట్రం ఏర్పరిస్తే .... ఒక కొత్త రాష్ట్రం , ఒక కొనసాగే రాష్ట్రం ఏర్పడతాయి.

ఉదాహరణకు:

>> ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాయల సీమను వేరు చెయ్యాలనుకుందాం! మిగతా భాగమంతా "సర్కార్ + తెలంగాణా ప్రాంతం" అవుతుంది. అప్పుడు కొత్త రాష్ట్రం ఏదవుతుంది? రాయలసీమే కదా! అంటే, 'ఆంధ్రప్రదేశ్' అనే ప్రస్తుత రాష్ట్రం అప్పుడు "సర్కార్ తెలంగాణా"లో కంటిన్యూ అవుతుందా? రాయలసీమలోనా? [సర్కార్ తెలంగాణాలోనే కదూ!] అట్లాగే ...

>> ఆంధ్రప్రదేశ్ నుంచి సర్కార్ ప్రాంతాన్ని వేరే చెయ్యాలనుకుందాం! మిగతా భాగమంతా రాయల తెలంగాణా అనుకుందాం. అప్పుడు కొత్త రాష్ట్రం ఏది? సర్కార్ రాష్ట్రమే కదా! అంటే, 'ఆంధ్రప్రదేశ్' అనే ప్రస్తుత రాష్ట్రం అప్పుడు "రాయల తెలంగాణా"లో కంటిన్యూ అవుతుందా? సర్కార్ ప్రాంతంలోనా? [రాయల తెలంగాణా లోనే కదూ!] అట్లాగే ...

>> ఆంధ్రప్రదేశ్ నుంచి రాయల సీమను, సర్కార్ ప్రాంతంతో సహా వేరే చెయ్యాలనుకుందాం! మిగతా భాగమంతా తెలంగాణా అనుకుందాం. అప్పుడు కొత్త రాష్ట్రం ఏది? సీమసర్కార్ రాష్ట్రమే కదా! అప్పుడు 'ఆంధ్రప్రదేశ్' అనే ప్రస్తుత రాష్ట్రం తెలంగాణలో కొనసాగుతుందా? సీమసర్కార్ ప్రాంతంలోనా? [తెలంగాణా లోనే కదూ!]

పై మూడు ఉదాహరణలలో - కొత్త రాష్ట్రానికి, కొనసాగే ఆంధ్ర ప్రదేశ్ కి వ్యత్యాసం ఏమిటి? రాజధాని లేని ప్రాంతం కొత్త రాష్ట్రం - రాజధాని మిగిలిపోయే ప్రాంతం కొనసాగే రాష్ట్రం!

ఇప్పుడు చెప్పండి - CWC 29వ రాష్ట్రాన్ని - ఏర్పాటు చేస్తే గీస్తే - అది ఎదవుతుంది? రాజధాని లేని సీమ-సర్కార్ ప్రాంతమే కదా! కొనసాగే ఆంధ్రప్రదేశ్ 'తెలంగాణానే' కదా! అంటే, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నుంచి సీమ-తీర ప్రాంతాన్ని విడదీసి, ఆర్టికల్ 3 a ప్రకారం కొత్తగా సీమసర్కార్ ప్రాంతాన్ని 29వ రాష్ట్రంగా చేస్తున్నట్లు లెక్క.

మరి 29వ రాష్ట్రం తెలంగాణా అంటారేమిటి? అది కొనసాగే రాష్ట్రం కదా? అది ఇప్పుడు ఉనికిలో ఉండి, ఇకముందు కూడా కొనసాగే ఆంధ్రప్రదేశే కదా! విడగోడుతోంది - సీమ-సర్కార్ ప్రాంతాన్ని కదా! కొత్త రాష్ట్ర రాజధాని అవసరమయ్యింది దానికే కదా! మరి, తెలంగాణా ఇస్తామంటారేమిటి? ఇచ్చేది సీమసర్కార్ రాస్ష్ట్రం కదా! ఆర్టికల్ 3-a ప్రకారం ఉనికిలో ఉన్న ఆంద్ర ప్రదేశ్ నుంచి సీమసర్కార్ రాష్ట్రాన్ని మాత్రమే ఏర్పాటు చెయ్య గలరు?

ఎవడడిగాడు?!

సరి సరి! మరి ఈ 'సేమసర్కార్ రాష్ట్రాన్ని' ఏర్పాటు చెయ్యమని ఎవరడిగారు? సీమ ప్రాంతం వాళ్ళు డిమాండ్ చేసారా? సర్కార్ ప్రాంతం వాళ్ళు డిమాండ్ చేసారా? ఎవరూ అడక్కుండానే - ఈ ప్రాంత ప్రజలను - బలవంతంగా చీల్చి వేరే రాష్ట్రంగా చేసేస్తామనే హక్కు, అధికారం కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? తెరాసాకి, తెదేపాకి ఎవరిచ్చారు? బీజేపీకి, సీపీఐకి ఎవరిచ్చారు? తెలంగాణా వాదులకు ఎవరిచ్చారు?

ఆర్టికల్ 3 a ప్రకారం - ప్రస్తుతం ఉన్న రాష్ట్రం నుంచి - ఒక ప్రాంతాన్ని లేదా ప్రాంతాలను వేరు చేసి కొత్త రాష్ట్రంగా రూపొందించే అధికారం - పార్లమెంటుకు ఉందనే అనుకుందాం! కానీ అట్లా - ఒక కొత్త రాష్ట్రాన్ని రూపొందించేందుకు ప్రాతిపదిక ఏమిటి?

> CWC ఇష్టా రాజ్యమా?
> ఇతర ప్రాంతాల వాళ్ళ డిమాండా?
> ప్రైవేటు రాజకీయ పార్టీల తీర్మానమా?
> తీవ్రవాదుల ఒత్తిడా?
> మీడియా ప్రచారమా? ఏది కొత్త రాష్ట్రం ఏర్పాటుకు గీటురాయి?

ఆనవాయతీ చూద్దాం:

<< బీహార్ నుంచి జార్ఖండ్ ప్రాంతాన్ని విడదీసి వేరే రాష్ట్రం చెయ్యమని జార్ఖండ్ ప్రజలు కోరారు. బీహార్ అట్లాగే ఉండి - జార్ఖండ్ ఏర్పడింది.
<< యంపీ నుంచి చత్తీస్ ఘడ్ ప్రాంతాన్ని విడదీసి వేరే రాష్ట్రం చెయ్యమని చత్తీస్ ఘడ్ ప్రజలు కోరారు. యంపీ అట్లాగే ఉండి - చత్తీస్ ఘడ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది.
<< యూపీ నుంచి ఉత్తరా ఖండ్ ప్రాంతాన్ని విడదీసి వేరే రాష్ట్రం చెయ్యమని ఉత్తరా ఖండ్ ప్రజలు కోరారు. యూపీ అట్లాగే ఉండి - ఉత్తరా ఖండ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది.

మరి, ఏపీ నుంచి సీమ-సర్కార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చెయ్యమని ఎవ్వరూ అడగకపోయినా విడదీస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రపంచంలో ఎక్కడైనా - ఇట్లా ఒక ప్రాంత ప్రజలను - వాళ్లకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా చీల్చడం - ఆ ప్రజా సమూహాన్నివెలివేసిన దానితో సమానం కాదా? సీమసర్కార్ ప్రజలు అంటరానివాళ్ళా? అంటరానివాళ్ళ రాష్ట్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారా? లేక సీమసర్కార్ ప్రాంతమంతటినీ ఒక దొంగల రాజ్యంగా భావిస్తున్నారా? లేక కెసీఆర్ వర్ణించినట్లు - ఈ భూభాగం ఒక రావణాసురిడి లంక అని లెక్కేస్తున్నారా? ఈ ప్రాంత ప్రజలంతా దోపిడీదారులని తీర్మానిస్తున్నారా? ఇదెక్కడి దారుణం? ఫ్యూడలిజంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా??
ఇందులోనూ మోసం ఏమిటంటే, ఆర్టికల్ 3 ప్రకారం - 29వ రాష్ట్రంగా 'తెలంగాణా రాష్ట్రం' ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం! ఇదెట్లా రాజ్యాంగబద్ధం అవుతుంది?

(+) ఏపీ నుంచి - తెలంగాణా ఏర్పరచాలంటే, హైదరాబాద్ (రాజధాని) లేని - తెలంగాణా ఏర్పరచాలి.
(+) హైదరాబాదు (రాజధాని) తో సహా ఏర్పరిచే తెలంగాణా అంటే - అది కొనసాగే ఏపీ రాష్ట్రమే - అవుతుంది. అంటే - కొత్త రాష్ట్రం - సేమసర్కార్ రాష్ట్రమే అవుతుంది. సీమసర్కార్ రాష్ట్రం కావాలని ఎవ్వడడిగాడు?

ఈ సందర్భాలన్నీ పరిశీలించిన న్యాయ కోవిదులు - తగిన పరిష్కారం చెప్పగలరని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment