Menu bar





Saturday, November 2, 2013

అఖిల పక్ష సమావేశాలు రద్దు చెయ్యండి!



రాష్ట్ర విభజన విషయంలో పార్టీల అభిప్రాయం కోరుతూ - మంత్రుల బృందం - అఖిల పక్ష సమావేశాలు ప్రకటించడాన్ని మేము తప్పుబడుతున్నాం. రాష్ట్రంలో ఈనాడున్న పరిస్థితులలో అన్ని పార్టీలూ ప్రాతినిధ్య అస్తిత్వం కోల్పోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు ప్రజల విశ్వసనీయత కోల్పోయాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్న మేము, మా తరఫున మాట్లాడటానికి ఏ పార్టీనీ అనుమతించడం లేదు!
మేము ఒక పార్టీకి కానీ, ఎమ్మెల్యే కి కానీ, ఎంపీకి కానీ వోటు వేసింది ప్రపంచంలోని అన్ని సమస్యలకూ - మా తరఫున ప్రాతినిధ్యం - అప్పగించేందుకు కాదు! కేవలం చట్ట సభలలోమా నియోజక వర్గ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వ్యవహరించుకోమని మాత్రమే! రాష్ట్ర విభజన విషయంలో పార్టీలు ప్రైవేటుగా తీసుకునే నిర్ణయాలకు - ప్రజలకు సంబంధం లేదు! అట్లాంటి నిర్ణయం ఏదైనా చట్ట సభల్లోనే జరగాలి! అక్కడి నిర్ణయాలనే పాక్షిక ప్రజాభిప్రాయంగా గ్రహించవచ్చు! రాష్ట్ర విభజన శాశ్వత మార్పు!
రాష్ట్ర విభజన వంటి విషయాలలో కేవలం చట్ట సభల అభిప్రాయం కూడా చాలదు! భవిష్యత్ తరాలకు సంబంధించిన శాశ్వత పరిణామాలకు దారి తీసే రాష్ట్ర విభజన నిర్ణయమ విషయంలో - జన సామాన్యం అభిప్రాయం తీసుకోవాల్సిందే! వివిధ ప్రజా సంఘాలు, వివిధ సెక్షన్లకు చెందిన ప్రతినిధుల అభిప్రాయం అనివార్యంగా తీసుకోవాలి!
రాష్ట్ర విభజనే వద్దని 8 కోట్ల ప్రజానీకం కోరుతున్నారు. ఆ పాపులర్ ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని పార్టీల ప్రైవేట్ ఉత్తరాలను రాష్ట్ర విభజనకు ప్రాతిపదికగా తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఒకవేళ పార్టీలన్నీకలిసి దేశాన్ని అమ్మేయడానికి తీర్మానిస్తే అది చెల్లుతుందా? మమ్మల్ని అమ్మేయడానికి ఏ పార్టీకీ మేము దస్తావేజులు రాసి ఇవ్వలేదు! కనుక అఖిల పక్ష సమావేశాలు తక్షణమే రద్దు చెయ్యండి. మా దృష్టిలో ఈ సమావేశాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మోసపూరిత చర్యలు మాత్రమే! అసెంబ్లీలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వ్యక్త పరచే ప్రజాభిప్రాయం "కట్టుబాటు" కాదని ప్రకటిస్తున్న వాళ్ళు, ఆయా పార్టీల సొంత సంస్థాగత అభిప్రాయాలు మాత్రం ఎట్లా "కట్టుబాటు" అవుతాయో చెప్పాలి! ఏ రాజ్యాంగ అధికరణంలో అట్లా రాసి ఉందో స్పష్టం చెయ్యాలి!
వివిధ రాజకీయ పార్టీలు స్వేచ్చగా పని చేసే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. కొన్ని చోట్ల నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి. పార్టీలను తరిమి కొడుతున్న దుస్థితి ఉంది. తీవ్రమైన విద్వేషాలు రెచ్చగొట్టబడిన విషమ వాతావరణంలో ఆయ పార్టీలు ఒత్తిడితో, నిర్బంధంతో వ్యక్తం చేసే అభిప్రాయాలు కనీసం 'విస్తృత రాజకీయ అభిప్రాయంగా కూడా" స్వీకరించడం కూడా తప్పే! ఈ సందర్భంలో - కేవలం రాజ్యాంగ పరమైన విధి విధానాలనే - జాతీయ మార్గదర్శకాలు, సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలి!
రాజ్యాంగ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి:
రాష్ట్ర విభజన అసెంబ్లీకి - రాష్ట్రపతికి - పార్లమెంటుకి మధ్య విషయం. దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ నడిపే ఏజెన్సీగా ఉండాలే కానీ తానే న్యాయ నిర్ణేతగా ఉండ కూడదు. మంత్రుల బృందం రూపొందించిన రిఫరెన్సు అంశాలు - తెలంగాణా ఏర్పడి పోయిందన్న నిర్ధారణతో - ఉన్నాయి. ఇది సరాసరి అక్రమం, అన్యాయం. వాటిని మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం. తీర్పు ఇవ్వడానికి మంత్రుల బృందానికి కానీ, కేబినెట్ కి కానీ అధికారం లేదు! తీర్పు ఇవ్వవలసినది పార్లమెంటు! పార్లమెంటుకు ప్రతిపాదన వెళ్ళకుండానే - తీర్పు ఇవ్వడం, దాన్ని అమలు చేసెయ్యడం - రాజ్యాంగ విరుద్ధమే కాదు, పార్లమెంటుకు అవమానం కూడా! ప్రతిపాదనకు - తీర్పుకూ తేడా లేకుండా - చేస్తున్న ముసిగుమ్మిడి వ్యవహారాలు ఇక కట్టిపెట్టండి.
రాష్ట్ర విభజన విషయంలో అన్ని రకాల ప్రజాస్వామిక విలువలనూ అతిక్రమించిన ప్రభుత్వం - ఇపుడు నాటకీయంగా - అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చెయ్యడం తెలుగు ప్రజలను అవమానించడమే! ఈ దుర్మార్గపు ఎత్తుగడలను తక్షణమే ఉపసంహరించుకోండి!

No comments:

Post a Comment